దారి కాచి దోపిడీ.. గ్యాంగ్‌ రేప్‌

దారి కాచి దోపిడీ.. గ్యాంగ్‌ రేప్‌ - Sakshi


► ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై అత్యాచారం

► ఇంటి యజమాని హత్య

► యూపీలో హైవేపై దొంగల బీభత్సం  




నోయిడా: ఉత్తరప్రదేశ్‌(యూపీ)లో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం అర్ధరాత్రి (గురువారం తెల్లవారుజామున) ఘోరం జరిగింది. దోపిడీ దొంగలు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలపై అత్యాచారానికి పాల్పడటమేగాక, ఆ ఇంటి యజమానిని హత్య చేసి నగలు, నగదు, ఫోన్లు దోచుకున్నారు. నోయిడాలో నివసించే పాత సామాన్ల వ్యాపారి షకీల్‌ ఖురేషీ (40)... బులంద్‌షహర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించేందుకు కుంటుంబంతో కలసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


ఆ సమయంలో కారులో మొత్తం 8 మంది ఉండగా వారిలో నలుగురు మహిళలు. రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కారు గౌతమ బుద్ధనగర్‌ జిల్లా జేవర్‌ పట్టణ దగ్గరలోని సబోటా అనే గ్రామ సమీపానికి రాగానే టైరు పంక్చర్‌ అయ్యేలా దుండగులు రోడ్డుపై మేకులు పెట్టారు. అయినా పంక్చర్‌ కాకపోవడంతో తుపాకీతో టైరును కాల్చారు. కారు ఆగగానే ఆయుధాలతో అక్కడకు చేరిన ఆరుగురు దోపిడీ దొంగలు..షకీల్‌ తల్లి, భార్య, చెల్లెలు, మరదలును పొలంలోకి లాక్కెళ్లి తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశారు. షకీల్‌ ప్రతిఘటించడంతో ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. కారులోని మిగతా ముగ్గురి కాళ్లు, చేతులు కట్టేశారు.


బాధితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, రూ.47 వేల నగదు, సెల్‌ఫోన్లను దోచుకుని దొంగలంతా అడవుల్లోకి పారిపోయారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతేడాది జూలైలోనూ కారులో నోయిడా నుంచి షాజహాన్‌పూర్‌ వెళ్తున్న తల్లీకూతుళ్లపై బులంద్‌షహర్‌లో దోపిడీ దొంగలు అత్యాచారం చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించడం తెలిసిందే. నాడు సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ..బీజేపీ సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేశాయి. కాగా, ఉత్తరప్రదేశ్‌లో రెండు నెలల క్రితమే బీజేపీ అధికారంలోకి రావడం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top