‘కామన్ మేన్’ సృష్టికర్త ఇకలేరు

‘కామన్ మేన్’ సృష్టికర్త ఇకలేరు


అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్‌కే లక్ష్మణ్

దైనందిన జీవితంలో అష్టకష్టాలు పడుతూ అన్నిచోట్లా తారసపడే నిస్సహాయ ‘కామన్ మేన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్(94) ఇక లేరు. ఐదు దశాబ్దాలుగా సామాన్యుడివైపు నిలిచి రాజకీయ నేతలపై చురుక్కుమనిపించే వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన సోమవారం పుణేలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ తదితరులు సంతాపం తెలిపారు.

 

 అనారోగ్యంతో కన్నుమూసిన ‘సామాన్యుడి’ సృష్టికర్త

 పుణే/న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలో అష్టకష్టాలు పడుతూ అన్నిచోట్లా తారసపడే నిస్సహాయ ‘కామన్ మేన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్(94) ఇక లేరు. ఐదు దశాబ్దాలుగా సామాన్యుడివైపు నిలిచి రాజకీయ నేతలపై చురుక్కుమనిపించే వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన సోమవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 6.50 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యుడు సమీర్ జోగ్ తెలిపారు. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, శ్వాస సమస్యలతో లక్ష్మణ్ ఈ నెల 17న ఆస్పత్రిలో చేరారు. పలు కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఆయనకు వెంటిలేటర్‌పై శ్వాస అందించారు. చికిత్సకు స్పందించినా ఆదివారం పరిస్థితి విషమించింది. లక్ష్మణ్‌కు భార్య, రచయిత్రి కమల, మాజీ జర్నలిస్టు అయిన కుమారుడు శ్రీనివాస్, కోడలు ఉష ఉన్నారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆర్‌కే నారాయణ్‌కు ఆయన తమ్ముడు. లక్ష్మణ్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించనున్నారు.

 

 ‘మీ బొమ్మలు సామాన్యుల మనోభావాలు’

లక్ష్మణ్ మృతితో ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితర ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన చిత్రాలు సామాన్యుల మనోభావాలని కొనియాడారు. సామాన్యుడిని జాతి ప్రతిమలా మలచిన ప్రజ్ఞాశాలిని కోల్పోయామని, తాను లక్ష్మణ్ అభిమానినని ప్రణబ్ పేర్కొన్నారు. ‘దేశం మిమ్మల్ని కోల్పోయింది. మా జీవితాల్లో అవసరమైన హాస్యాన్ని పంచి, మా ముఖాల్లో నవ్వులు పూయించినందుకు మీకు ఎంతో కృతజ్ఞులం’ అని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలపై లక్ష్మణ్ కార్టూన్లు పదునైన విమర్శలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లక్ష్మణ్ సృజనాత్మకతకు సున్నిత హాస్యాన్ని జోడించారని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో రాజకీయ వ్యంగ్యచిత్రానికి నడకలు నేర్పిన మహామనీషి లక్ష్మణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఆయన కార్టూన్లు జాతీయ సంపద అని, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. సీపీఎం నేత బీవీ రాఘవులు, సీపీఐ నేత కె.రామకృష్ణ కూడా సంతాపం తెలిపారు.

 

 లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. 1921, అక్టోబరు 24న మైసూర్‌లో ఓ బడిపంతుల కుటుంబంలో జన్మించారు. ఏడుగురు తోబుట్టువుల్లో ఆయన ఆఖరి వారు. అన్నయ్య సుప్రసిద్ధ నవలా రచయిత ఆర్‌కే నారాయణ్. లక్ష్మణ్ బాల్యం నుంచే చిత్రకళపై ఆసక్తి కనబరచారు. అక్షరాలు అబ్బకముందే బొమ్మలు గీశారు. మైసూరు మహారాజా కాలే జీలో చదువుతుండగా స్వరాజ్య, బ్లిట్జ్ పత్రికలకు బొమ్మలు వేశారు. ముంబైలోని ‘జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బొమ్మల్లో పరిణతి లేదని కాలే జీ అడ్మిషన్ నిరాకరించింది. లక్ష్మణ్ నిరాశపడకుండా తన కళ లో మరింత కృషి చేశారు. మైసూరు వర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేసి పేరు తెచ్చుకున్నారు. దివంగత  శివసేన అధినేత, కార్టూనిస్టు బాల్ ఠాక్రేతో కలసి కొన్నాళ్లు ‘ఫ్రీ ప్రెస్ జర్నల్’లో పనిచేశారు.

 

 పతనమౌతున్న ప్రజాస్వామిక విలువలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి గొప్ప మానవతావాదిగా కూడా పేరు గడించారు. లక్ష్మణ్ 1951లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘యూ సెడిట్’ శీర్షికతో కామన్ మేన్ కార్టున్లు ప్రారంభించి యావత్ దేశాన్ని ఆకర్షించారు. ఆ పత్రిక 150వ వార్షికోత్సం సందర్భంగా 1988లో ‘కామన్ మేన్’పై ఓ పోస్టల్ స్టాంపు విడుదలైంది. పుణేలో 16 అడుగుల ఎత్తున్న కామేన్ మేన్ విగ్రహాన్నీ నెలకొల్పారంటే ఆ కార్టూన్లకు దక్కిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. లక్ష్మణ్ 1985లో లండన్‌లో తన చిత్రాలను ప్రదర్శించారు. ఓ భారతీయ కార్టూనిస్టు చిత్రాలను ఆ నగరంలో ప్రదర్శించడం అదే తొలిసారి. ‘దేశానికి రాజకీయ నాయకులు చెడ్డవాళ్లే కావొచ్చుగానీ నా వృత్తికి మాత్రం మంచివాళ్లే’ అని ఆయన చమత్కరించేవారు. ‘నా కామన్ మేన్ సర్వాంతర్యామి.. అతడు ఈ యాభై ఏళ్ల నుంచీ మౌనంగా ఉంటున్నాడు. కేవలం వింటుంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

 

లక్ష్మణ్ బహుముఖ ప్రజ్ఞశాలి కూడా. ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో ఆత్మకథ రాశారు. ‘హోటల్ రివేరా’ తదితర నవలలూ రచించారు. నారాయణ్ రాసిన ‘మాల్గుడీ డేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా పని చేశారు. ఆయన భరతనాట్య కళాకారిణి, అలనాటి సినీనటి కుమారి కమలను వివాహం చేసుకున్నారు. విభేదాలతో ఆమెనుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత కమల అనే రచయిత్రిని పెళ్లాడారు. 2003లో పక్షవాతం వచ్చేవరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో  అనుబంధం కొనసాగింది. కళలు, సాహిత్యం, జర్నలిజంలో విశిష్ట కృషికి ఆయన పద్మవిభూషణ్, మెగసెసే తదితర విశిష్ట పురస్కారాలు అందుకున్నారు.

 

 కార్టూనే ఖఢ్గం..

 ఆర్‌కే లక్ష్మణ్ అనగానే పాఠకులకు అతని కామన్ మేన్ గుర్తుకొస్తాడు. బట్టతల, గాంధీ కళ్లద్దాలు, గళ్ల కోటు, ధోవతీతో అన్నిచోట్లా తిరుగుతూ సమస్త అన్యాయాలనూ మౌనంగా భరించే ఆ సామాన్యుడి చిత్రంతో లక్ష్మణ్ దిగజారుడు రాజకీయాలపై పదునైన విమర్శలు చేశాడు. సామాన్యుల ఆశలను వమ్ము చేసి వాగ్దాన భంగాలకు పాల్పడే నాయకులను వెటకారాల గీతలతో దునుమాడారు. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలకు అద్దం పడుతూ సున్నితమైన హాస్యంతోనే అయినా ఘాటు విమర్శలు సంధించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top