మిఠీనది పరిరక్షణకు బీఎంసీ కసరత్తు

మిఠీనది పరిరక్షణకు బీఎంసీ కసరత్తు - Sakshi


- జలశుద్ధీకరణ కేంద్రం నిర్మాణానికి ఆమోదం

- నదిపై అక్రమంగా వెలసిన కట్టడాలు, పరిశ్రమలపై చర్యలు

సాక్షి, ముంబై:
మిఠీనది పరిరక్షణ, జలాల శుద్ధికి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) శ్రీకారం చుట్టింది. నదిలో పెరిగిపోయిన కాలుష్యకారకాలను తక్షణమే తొలగించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నదిపై జల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మీఠీనది పరిరక్షణ చర్యలు చేపట్టాలని, కాలుష్యాన్ని  అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీకి ఆర్నెళ్ల కిందటే మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసు జారీ చేసింది. ఇందుకు స్పందించిన బీఎంసీ పరిపాలన విభాగం ఈ మేరకు జలశుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మిఠీనదిలోకి ఎక్కడెక్కడి నుంచి మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తున్నాయో, జల శుద్ధీకరణ కేంద్రం ఎక్కడ నిర్మించాలనే విషయాలను అధ్యయనం చేయడానికి ఐటీఐకి చెందిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బీఎంసీ పరిపాలన విభాగానికి సూచనలు చేయనుంది.

 

కుచించుకుపోయిన నది

మీఠీనదిలోకి నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తాయి. నగర ప్రజలు దైనందిన పనులకు వాడే నీటితోపాటు పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు కూడా  ఇందులోనే కలువడంతో నది కాలుష్యకాసారంగా మారింది. ఫలితంగా 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరంతోపాటు శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్పట్లో వచ్చిన వరదలకు 200పైగా మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. ఈ ఘటనతో కళ్లు తెరిచిన ప్రభుత్వం వరదలకు ప్రధాన కారణాలను అధ్యయనం చేసేందుకు చితలే కమిటీని నియమించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఈ కమిటీ మిఠీనది కుచించుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లడం లేదని, దీంతోపాటు నదికి ఇరువైపులా మట్టిపోసి అందులో వెలసిన అక్రమ కట్టడాలే వరదముప్పునకు ప్రధాన కారణంగా తేల్చి చెప్పింది. అప్పటి నుంచి మిఠీనది అభివృద్ధి అంశం తెరమీదకు వచ్చింది.

 

సుమారు 500 పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు

ఈ నదిలో సుమారు 500పైగా పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయని కాలుష్యనియంత్రణ మండలి విడుదల చేసిన జాబితాలో స్పష్టం చేసింది. ఇందులో నుంచి ఏ పరిశ్రమ నుంచి ఎంతమేర కలుషిత నీరు చేరుతుందనేది పరిశీలించాల్సి ఉంది. ఆ తరువాత ఆయా యజమానులపై చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ అశోక్ ఖైరే వెల్లడించారు. అదే విధంగా మిఠీనదిని ఆక్రమించుకొని  రెండు వైపులా వెలసిన అక్రమ కట్టాడాలు, పరిశ్రమలపై చర్యలు తీసుకొనున్నట్లు చెప్పారు. మీఠినది పరిరక్షణకు అవసరమైన అన్నిచర్యలను తీసుకొంటామని ఆయన చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top