అమరులకు ఘననివాళి


సాక్షి, ముంబై: ముంబైలో జరిగిన 26/11 ఘటనలో ముష్కరుల దాడిలో బలైన అమాయకులకు, అమరవీరులకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు ఇతర  మంత్రులు, రాజకీయనాయకులు, సామాన్య ప్రజలు నివాళులర్పించారు. ముంబైనగరంపై ముష్కరుల దాడులు జరిగి బుధవారం నాటికి ఆరేళ్లు పూర్తిఅయ్యాయి.



 ఈ నేపథ్యంలో ముంబై, ఠాణే, పుణేలతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నివాళి అర్పించారు. అదే విధంగా రక్తదాన శిబిరాలు, ర్యాలీలు నిర్వహించారు. పుణేలో ఉన్న దేవేంద్ర ఫఢ్నవిస్ అమరులకు నివాళులర్పించిన అనంతరం ఇచ్చిన సందేశంలో పోలీసు శాఖను మరింత ఆదునికీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామన్నారు.



రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుణే పర్యటనలో ఉన్నందున ప్రొటోకాల్‌లో భాగంగా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్ కూడా ఆయన వెంటే ఉన్నారు. మరోవైపు ముంబై మరీన్‌లైన్స్ పోలీసు జింఖానాలో పోలీసు అమరవీరుల స్మారకం వద్ద ఉదయం 10 గంటలకు అనేక మంది నివాళులు అర్పించారు. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే, ప్రకాష్ మెహతాతోపాటు మహారాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్, ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. అదే విధంగా అమరువీరుల కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అమరవీరులను మరచిపోయారంటూ ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్ ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top