రీ ఎంట్రీ?

రీ ఎంట్రీ? - Sakshi


ఫలించిన తల్లి రాయబారం

మెట్టుదిగిన అళగిరి

ఓకే అంటున్న చిన్నోడు

త్వరలో మళ్లీ డీఎంకేలోకి...

 సాక్షి, చెన్నై: డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి అన్నా అరివాలయం వర్గాలు. తల్లి దయాళు అమ్మాల్ రాయబారం ఫలించడంతో పెద్దోడు అళగిరి, చిన్నోడు స్టాలిన్ త్వరలో ఏకం కానున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అళగిరి మెట్టు దిగడం, స్టాలిన్ ఓకే చెప్పడంతో మరికొద్ది రోజుల్లో పార్టీలోకి దక్షిణాది కింగ్ మేకర్ పునరాగమనం చేయనున్నట్లు చర్చ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు డీఎంకే లో చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీని సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయి. అన్నదమ్ముళ్లు అళగిరి, స్టాలిన్ మధ్య వారసత్వ వివాదం చివరకు పార్టీకి గడ్డు పరిస్థితుల్ని తీసుకొచ్చిపెట్టాయి.



అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించడం, ఆయన పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించడం వెరసి డీఎంకే డిపాజిట్లు రాష్ట్రంలో గల్లంతయ్యాయి. పరిస్థితి దారుణంగా తయారు కావడంతో ప్రక్షాళన పర్వానికి శ్రీకారం చుట్టిన అధినేత ఎం కరుణానిధి, తన అస్త్రాల్ని ప్రయోగించే పనిలో పడ్డారు. అదే సమయంలో అళగిరి రూపంలో మున్ముందు పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుందోనన్న బెంగ మొదలైంది. దీంతో పార్టీకి, కుటుంబానికి వస్తున్న అపవాదులు సమసిపోయే రీతిలో వ్యూహాత్మకంగా కరుణానిధి వ్యవహరించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

 

ఫలించిన రాయబారం: అళగిరిని బుజ్జగించడం లక్ష్యంగా తల్లి దయాళు అమ్మాల్ రంగంలోకి దిగారు. కొద్ది రోజు లుగా అళగిరితో ఆమె సంప్రదింపులు జరుపుతున్నట్టు, తరచూ ఫోన్‌ద్వారా తనయుడి అలక తీర్చే పనిలో పడ్డట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్నాళ్లు మౌనంగా ఉండాలంటూ అళగిరికి తల్లి సూచించినట్టు, ఇక మీదట మౌనంగా ఉంటే, పార్టీలోకి మళ్లీ తీసుకుంటారన్న సంకేతాన్ని ఆయనకు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంతో పెద్దోడిగా శ్రమించాల్సిన అవసరం ఉందని ఆమె హితవు పలికినట్టు సమాచారం. అదే సమయంలో చిన్నోడు స్టాలిన్‌కు నచ్చ చెప్పే పనిలో అటు కరుణానిధి, ఇటు దయాళు అమ్మాల్ సఫలీ కృతలైనట్టు తెలిసింది.

 

త్వరలోనే: అన్న దమ్ముళ్ల మధ్య ఉన్న వైర్యాన్ని సామరస్య పూర్వకంగా కొలిక్కి తీసుకురావడంతో, ఇక అళగిరి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అన్న ప్రచారం డీఎంకేలో ఊపందుకుంటోంది. అళగిరి మౌనంగా ఉంటే, తాను మౌనంగా ఉంటానని, పార్టీ కోసం తాను ఇన్నాళ్లు జరిగిన పరిణామాల్ని మరిచి పోతున్నట్టుగా స్టాలిన్ పేర్కొనట్టుగా పార్టీలో చర్చ సాగుతోంది. అళగిరి రీ ఎంట్రీకి స్టాలిన్ ఓకే చెప్పినట్టు సంకేతాలున్నాయి. తల్లి రాయబారానికి దిగొచ్చిన అళగిరి తన మద్దతుదారులతో సంప్రదింపుల్లో నిమగ్నమయ్యారు.



తమ నేత డీఎంకేలో ఏదో ఒక రోజు మళ్లీ వస్తారన్న ఆశతో ఇన్నాళ్లు ఎదురు చూస్తూ వచ్చామని, అది జరగనుండడం ఆనందంగా ఉందని అళగిరి మద్దతు నాయకుడు ఒకరు పేర్కొన్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలసి కట్టుగా కృషి చేయడం వల్లనే గతంలో అనేక ఎన్నిక ల్లో డీఎంకే విజయ ఢంకా మోగించిందని, మళ్లీ ఇద్దరూ ఏకమైతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తిరుగు ఉండదంటూ స్టాలిన్ మద్దతు నాయకుడు పేర్కొంటుండటం బట్టి చూస్తే, త్వరలో అళగిరి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అనిపిస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top