ఆ నీచుణ్ని పెళ్లాడను...

ఆ నీచుణ్ని పెళ్లాడను... - Sakshi


వారణాసి:  ఉత్తర ప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఒక యువతి  కుటుంబ పెద్దలను, కులపెద్దలను, పోలీసులను ఎదురొడ్డి నిలబడిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.  తనపై లైంగిక దాడిచేసిన వ్యక్తితో పెళ్లిని అడ్డుకొని, విజేతగా నిలిచింది. గ్రామ పెద్దలు, పోలీసులు, కుటుంబసభ్యుల కుట్రను భగ్నం చేసింది.


అత్యాచారం చేసిన దుర్మార్గుడితోనే బాధితురాలికి పెళ్లి చేయించి, కేసుల నుంచి తప్పించుకున్న సంఘటనలు కోకొల్లలు. ఉత్తరప్రదేశ్లోని  వెనుకబడిన జిల్లా సజోయ్లో కూడా సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే జరిగింది.   కానీ దీనికి ససేమిరా అన్న యువతి ధైర్యంగా నిలబడి పోరాడింది. ఎట్టకేలకు  బలవంతపు  తంతు నుంచి బయట పడింది. అత్యాచారం చేసిన యువకుడితోనే  ఓ యువతికి  పెళ్లి చేయించేలా కులపెద్దలు రాజీ కుదిర్చారు.  తాను ఆ పెళ్లి చేసుకోనని ఆమె కచ్చితంగా తేల్చి చెప్పింది, ధైర్యంగా గత ఫిబ్రవరి 25న పోలీసు స్టేషన్లో  ఫిర్యాదు చేసింది.  కానీ ఆమెకు అండగా ఉండాల్సిన రక్షకభటులు ఆమె మాటలను పట్టించుకోలేదు. పైగా రెండు కుటుంబాల మధ్య రాజీ కుదర్చడంపైనే దృష్టి పెట్టారు. చివరకి  అమ్మాయికి తెలియకుండానే పెళ్లి  ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం అబ్బాయి కుటుంబం బారాత్ కార్యక్రమానికి సిద్ధమైంది.  దీంతో  అవాక్కయిన ఆ అమ్మాయి  సదరు పెళ్లికొడుకును  అరెస్టు చేసే దాకా పట్టువదల్లేదు.


తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న జాస్నా పోలీస్ స్టేషన్ అధికారి బసంత్ రామ్.. సెక్షన్ 376 కింది కేసు నమోదు చేశారు. అయితే నిందితుడిని గత నెల రోజులుగా ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలకు  మాత్రం  పోలీసుల దగ్గర సమాధానం లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top