ఈ లెక్కన వెంకయ్యకు 482 ఓట్లు

ఈ లెక్కన వెంకయ్యకు 482 ఓట్లు


రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లను తీసుకుంటే... ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 522 మంది ఎంపీలు ఓటేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్‌కు 225 మంది ఎంపీల మద్దతు లభించింది. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 771 మంది ఎంపీలు ఓటింగ్‌కు అర్హులు. (మిగతావి ఖాళీలు, కోర్టు తీర్పు కారణంగా ఒక బీజేపీ ఎంపీకి ఓటింగ్‌ హక్కు లేదు.) రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్నవారు, గైర్హాజరైన వారు పోను... 747 మంది ఓటు వేశారు. వీటిలో కోవింద్‌కు 522 ఓట్లుపడ్డాయి. దీన్ని ప్రామాణికంగా తీసుకొని... ఆగష్టు 5వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడికి ఎన్ని ఓట్లు పడతాయో అంచనా వేయవచ్చు.



రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏను కాదని కోవింద్‌కు మద్దతునిచ్చిన జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) ఉపరాష్ట్రపతికి మాత్రం విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని బలపరుస్తామని ప్రకటించింది. అలాగే గోపాలకృష్ణ తన చిరకాల మిత్రుడు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (బీజేడీ) మద్దతు ఆయనకే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. అంటే కోవింద్‌కు లభించిన జేడీయూ, బీజేడీ మద్దతు వెంకయ్యకు ఉండదు.



ఈ రెండు పార్టీలకు లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 40 మంది ఎంపీలున్నారు (బీజేడీకి లోక్‌సభలో 20, రాజ్యసభలో 8– జేడీయూకు లోక్‌సభలో 2, రాజ్యసభలో 10 మంది ఎంపీలున్నారు). అంటే కోవింద్‌కు వచ్చిన ఎంపీల ఓట్లలో వెంకయ్యకు 40 తగ్గుతాయి. 482 ఓట్లు ఆయనకు వస్తాయి. గోపాలకృష్ణ గాంధీకి 265 ఓట్లు పడతాయి. గైర్హాజరైన ఎంపీల్లో కొందరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నా, క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా ఈ çసంఖ్య కొంచెం అటుఇటూ కావొచు. ఉపరాష్ట్రపతిని ఎంపీలు మాత్రమే ఎన్నుకుంటారు. – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

సంబంధిత వార్త


రాజన్‌బాబు నుంచి నేటి వరకూ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top