నాడు అబ్దుల్‌ కలాం నేడు కోవింద్‌

నాడు అబ్దుల్‌ కలాం నేడు కోవింద్‌ - Sakshi


న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా నాడు అబ్దుల్‌ కలాం ఆజాద్‌ను నాటి అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలోని బేజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడానికి, నేడు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడానికి సుస్పష్టమైన లెక్కలు ఉన్నాయి. 2002లో ఫిబ్రవరి–మార్చి నెలల మధ్య గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లతో వెయ్యి మందికిపైగా ముస్లింలు మరణించారు. పదివేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. అటు గుజరాత్‌లోని మోదీ ప్రభుత్వంపైనా, కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వంపై ముస్లిం ప్రజలు మండిపడుతున్న సమయమది.



అంత పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లను చూసి వాజపేయి కూడా ఎంతో నొచ్చుకున్నారు. ముస్లిం ప్రజల పట్ల తమకు భేదభావం లేదని చెప్పడానికి, వారిని శాంతింపచేయడానికి 2002, జూన్‌ 10వ తేదీన రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్‌ కలామ్‌ పేరును ప్రకటించారు.  పోఖ్రాన్‌ అణు పరీక్షల విజయంలో ప్రత్యక్ష పాత్ర ఉండడం, ఆయన రోజు భగవద్గీత చదువుతారన్న ప్రచారమూ ముందుగా వ్యతిరేకించినా ఆతర్వాత ఆరెస్సెస్‌ను అంగీకరించేలా చేసింది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా యూపీలోని యోగి ఆధిత్యనాథ్‌ ప్రభుత్వం దళిత వ్యతిరేకమైనదన్న ప్రచారంతోపాటు దేశంలో పలుచోట్ల దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకత్వం దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది.



2016, జనవరి నెలలో హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్శిటీలో రోహిత్‌ వేముల ఆత్మహత్య, ఉనాలో చనిపోయిన గోవు తోలును వలుస్తున్న దళితులను చితకబాదడం, మాయావతిని వ్యభిచారికన్నా నీచమైనదని యూపీలోని బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ విమర్శించడం, ఆయన భార్య స్వాతి సింగ్‌కు యూపీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌ ఇవ్వడం, ఆమె గెలిచాక యోగి క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వడం తదితర పరిణామాలన్నీ బీజేపీ దళిత వ్యతిరేకమన్న ప్రచారానికి దోహదం చేశాయి. ముఖ్యంగా యూపీలో ఇటీవల ఠాకూర్లు, దళితులకు మధ్య జరిగిన అల్లర్లు దీనికి మరింత ఆజ్యం పోసింది. దళితుల యాభై ఇళ్లను ఠాకూర్లు దగ్ధం చేయడం, వారికి వ్యతిరేకంగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వాన ‘భేమ్‌ ఆర్మీ’ నిరసనను పోలీసులు అడ్డుకోవడం, ఆయన్ని అరెస్ట్‌ చేసి అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టడం దళితుల్లో ఆగ్రహాన్ని నింపింది.



తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ దళితవాడను సందర్శించినప్పటికీ బాబా అంబేద్కర్‌కు నివాళులర్పించలేదు. పైగా ఆయన వెంట ఉన్న కార్యకర్తలు, దళితులు ‘జై భీమ్‌’ అని నినాదాలు చేస్తుంటే అందుకు బదులుగా ‘జై శ్రీరామ్‌’ అనాల్సిందిగా గొడవ చేశారు. అంతకుముందు రోజు అధికారులు దళితుల వద్దకు వచ్చి, సబ్బులు, షాంపోలు పంచారు. శుభ్రంగా స్నానం చేసి ముఖ్యమంత్రి కార్యక్రమానికి రావాలని ఆదేశించారు. ఈ ఉదంతంతో కూడా దళితులు కోపోద్రిక్తులయ్యారు. సరిగ్గా ఈ సమయంలో దళితులను మంచి చేసుకోవచ్చు. దళిత వ్యతిరేకులంటూ ప్రతిపక్షాలు విమర్శంచకుండా తప్పించుకోనూ వచ్చనే దూరాలోచనతోనే కోవంద్‌ను ఎంపిక చేశారు. ఆయనకు ఓటు వేయని వారంతా దళిత వ్యతిరేకులేనంటూ అప్పుడే కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ ప్రచారం కూడా ప్రారంభించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top