చుక్ చుక్... హైటెక్

చుక్ చుక్... హైటెక్


ఆధునీకరణ పట్టాలపైకి ‘సురేశ్‌ప్రభు రైలు’ పరుగులు

న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలు కానున్న 2015-16 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను సురేశ్‌ప్రభు గురువారం నాడు పార్లమెంటుకు సమర్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈ బడ్జెట్‌లో ఒక్క కొత్త రైలును కానీ, ఒక్క కొత్త రైలు మార్గాన్ని కానీ ప్రకటించలేదు. ఉన్న రైళ్ల సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రస్తుత రైలు మార్గాలను పొడిగించి, బలోపేతం చేస్తామని చెప్పారు. కొత్త ప్రాజెక్టులేవీ ఇవ్వలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తిచేయటానికే ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. అయితే.. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ప్రతిపాదనలపై సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బడ్జెట్‌లో ప్రయాణ చార్జీలను పెంచలేదు.

 

కానీ.. సరుకు రవాణా చార్జీలను పది శాతం మేర పెంచారు. వచ్చే ఐదేళ్లలో 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ఈ పెట్టుబడులను మార్కెట్ రుణాలు, పింఛను నిధులు, బహుళ అభివృద్ధి బ్యాంకుల నుంచి సమీకరిస్తామని చెప్పారు. ఇందులో రైల్వేలు కేటాయించే నిధులు ఎంతనేది మాత్రం చెప్పలేదు. రాబోయే ఏడాదికి మాత్రం మూలధన వ్యయం ఏకంగా 52 శాతం పెంచుతూ.. వచ్చే ఏడాది లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైల్వేల ప్రయివేటీకరణ ఉండదని.. అది ప్రభుత్వరంగ సంస్థగానే ప్రజలకు సేవలందిస్తుందని ఉద్ఘాటించారు. అయితే.. రైల్వేల విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం అమలు చేస్తామన్నారు!  

 

 సరుకు రవాణా చార్జీల పెంపు...

 ‘‘నేను ప్రయాణ చార్జీలను పెంచలేదు’’ అని బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే ప్రకటించిన సురేశ్ ప్రభు.. 12 రకాల సరకుల రవాణా చార్జీలను మాత్రం పది శాతం మేర పెంచటం గురించి మాత్రం ప్రస్తావించలేదు. సరుకుల రవాణా చార్జీల జాబితా ‘హేతుబద్ధీకరణ’ పేరుతో కాగితాలపైనే ఆ పని కానిచ్చారు. వాస్తవానికి.. డీజిల్ ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖకు 12,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయల వరకూ ఆదా అవుతుందని రైల్వే అధికారుల అంచనా. అయినా.. సరుకు రవాణా ద్వారా మరో రూ. 4,000 కోట్లు ఆదాయం పెంచుకునేలా ఆ చార్జీలను ‘సవరించారు’. ఎరువుల రవాణా చార్జీలు 10 శాతం పెంపు వల్ల.. ఇప్పటికే రూ. 3,000 కోట్ల మేరకు ఉన్న సబ్సిడీ భారం మరో రూ. 300 కోట్ల మేర పెరగనుంది. అయితే.. ఈ భారాన్ని ఎరువుల ధరలను పెంచి రైతులపై మోపబోమని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించటం కాస్తంత ఊరటనిచ్చింది. కానీ.. ఆహార ధాన్యాల రవాణా చార్జీలు పది శాతం పెరగటం వల్ల రూ. 600 కోట్ల వరకూ భారం పడుతుందని.. వీటితో పాటు సిమెంట్, బొగ్గు, గ్యాస్, కిరోసిన్ వంటి సరుకులు రవాణా చార్జీల పెంపు వల్ల.. ఆయా సరుకుల ధరలు పెరుగుతాయని.. ఈ భారం అంతిమంగా ప్రజలపైనే పడుతుందని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు.

 

 4, 5, 11 - ఇది రైల్వేమంత్రి మంత్రం...

 ఎటువంటి భారీ ప్రకటనలూ లేకుండా రూపొందించిన బడ్జెట్‌లో.. రైల్వేల్లో పెట్టుబడుల లోపం అనే విషవలయానికి చరమగీతం పలకడానికి.. నాలుగు లక్ష్యాలు, ఐదు చోదకాలు, 11 ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. రాబోయే తొమ్మిదేళ్ల కాలంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరచటం రైల్వేల స్వల్ప కాలిక లక్ష్యమని చెప్పారు. ఆర్థికవ్యవస్థ ప్రధాన చోదకశక్తిగా రైల్వేలను మళ్లీ అభివృద్ధి చేయటం, అధిక పెట్టుబడుల కోసం వనరులను సమీకరించటం, భారీ మార్గాలపై ఒత్తిడిని తగ్గించటం, రైళ్ల వేగాన్ని పెంచటం, ప్రయాణ సదుపాయాలు, భద్రతాచర్యలు మెరుగుపరచటం, రైల్వే మౌలికసదుపాయాల బలోపేతం తదితర 11 అంశాలపై ప్రధాన దృష్టి ఉంటుందని చెప్పారు. ఎంపిక చేసిన శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు, బి-కేటగిరీ రైల్వేస్టేషన్లలోనూ వైఫై సదుపాయం, మరో 200 రైల్వే స్టేషన్లు ఆదర్శ స్టేషన్ల పథకం కిందికి తేవటం వంటి చర్యలను రైల్వేమంత్రి ప్రకటించారు.

 

 నాలుగు లక్ష్యాలు

 1) ప్రయాణికుల అనుభూతిని సుస్థిరంగా మెరుగుపరచటం, 2) రైల్వేలను సురక్షితమైన రవాణా సాధనంగా మలచటం, 3) రైల్వే మౌలిక సదుపాయాల సామర్థ్యాలను విస్తరించటం, ఆధునీకరించటం, 4) సామర్థ్య విస్తరణకు, క్షీణిస్తున్న ఆస్తులను తిరిగి బలోపేతం చేయటానికి వీలుగా భారీ మిగులు సృష్టించటం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించటం అనేవి నాలుగు లక్ష్యాలుగా చెప్పారు. వీటిలో.. రోజు వారీ ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 2.1 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచటం; రైలు మార్గాల నిడివిని 20 శాతం - ఇప్పుడున్న 1.14 లక్షల కిలోమీటర్ల నుంచి 1.38 లక్షల కిలోమీటర్లకు - పెంచటం; వార్షిక సరుకు రవాణా సామర్థ్యాన్ని 100 కోట్ల టన్నుల నుంచి 150 కోట్ల టన్నులకు పెంచటం వంటివి ఉన్నాయి.

 

 ఐదు చోదకాలు

 1) రైల్వేలను సంపూర్ణంగా రూపాంతరం చేయటానికి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక, 2) నిధుల లభ్యత, చిట్టచివరి మైలు అనుసంధానం కోసం రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బహుముఖ సంస్థలు, ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం, 3) ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల సమీకరణ, 4) నిర్వహణ విధానాలను పునర్‌వ్యవస్థీకరించటం, 5) పాలన, పారదర్శకతల ప్రమాణాలను నిర్దేశించటం అనేవి ఐదు చోదకాలుగా పేర్కొన్నారు.

 

 9,420 కిలోమీటర్ల లైన్ల సామర్థ్యం పెంపు...

 రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు, సదుపాయాలను మెరుగుపరిచేందుకు రైల్వేమంత్రి అనేక చర్యలు ప్రకటించారు. గుర్తించిన రైళ్లలో మరిన్ని సాధారణ తరగతి బోగీలను ఏర్పాటు చేస్తామన్నారు. 9,420 కిలోమీటర్ల రైల్వే లైన్ల సామర్థ్యాన్ని విస్తరించటానికి రూ. 96,182 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. నాలుగు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం ఈ ఏడాది పూర్తవుతుందని.. మరో 6,608 కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణ పూర్తవుతుందని  చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులకు సులభతరంగా ఉండేలా బోగీ తయారీ పథకాన్ని సమీక్షిస్తామని పేర్కొన్నారు. ముంబై - అహ్మదాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ఏర్పాటుపై అధ్యయన నివేదిక మరో నాలుగైదు నెలల్లో అందుతుందని చెప్పారు. భద్రతా చర్యలకు సంబంధించి వార్షిక లక్ష్యాలను గుర్తించేందుకు.. ఐదేళ్ల కార్పొరేట్ భద్రతా ప్రణాళిక మూడు నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు.

 

 మెట్రో సిటీల మధ్య రైళ్ల వేగం పెంపు

మెట్రో సిటీల మధ్య నడిచే రైళ్ల వేగం గణనీయంగా 200 కిలోమీటర్ల వరకు పెరగనుంది. ఎంపిక చేసిన తొమ్మిది రైల్వే కారిడార్లలో ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై వంటి మెట్రో నగరాల మధ్య ప్రయాణం రాత్రి గడిచేలోగా పూర్తయ్యేలా చూడటమే ఇందులోని ప్రధానాంశం. ఆయా తొమ్మిది రైల్వే కారిడార్లలో ప్రస్తుతం గంటకు 110, 130 కిలోమీటర్లుగా ఉన్న రైళ్ల వేగాన్ని.. ఇకపై 160, 200 కిలోమీటర్లకు పెంచనున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు తగినట్టుగా ట్రాక్‌లను మెరుగుపరచడం, బోగీలను ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, వంటి చర్యలు చేపడతామని తెలిపారు. గూడ్స్ రైళ్ల సగటు వేగాన్ని కూడా పెంచనున్నట్లు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ వంటి ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకు ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.  

 

 వీలైన ప్రతి చోటా సౌర విద్యుదుత్పత్తి

 ప్రయాణికుల చార్జీలను పెంచకూడదన్న నిర్ణయం వెనుక ఇటీవలి కాలంలో డీజిల్ ధరలో చోటుచేసుకున్న భారీ తగ్గుదల కూడా ఒక కారణమని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ప్రయాణికులకు అందిస్తున్న సేవల్లో మెరుగుదలను చూపకముందే చార్జీలను పెంచడం అన్యాయమని తనకు అనిపించిందన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రైల్వేలకు చెందిన స్థలాలను, స్టేషన్లను, ట్రాకులను సౌర విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించుకుంటామన్నారు. అవకాశమున్న ప్రతి చోటా సౌరఫలకాలను ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేస్తామన్నారు.

 

 హైటెక్ మార్గంలో సురేశ్‌ప్రభు రైలు...

 *    400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం

 *    ప్రత్యేక ఈ-టికెటింగ్ వెబ్‌సైట్ రూపకల్పన, డెబిట్ కార్డుతో టికెట్లు పొందే సౌకర్యం

 *    ఆన్‌లైన్‌లో విశ్రాంతి గదుల బుకింగ్, వికలాంగులకు వీల్‌చైర్ బుకింగ్

 *    టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే నచ్చిన ఆహారం ఎంచుకునే సదుపాయం

 *    బ్రాండెడ్ సంస్థలు, ఫుడ్-చైన్ సంస్థలతో ప్రయాణికులకు ఆహార సరఫరా

 *    120 రోజుల ముందుగానే ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం

 *    స్టేషన్‌కు వచ్చిన ఐదు నిమిషాల్లోనే సాధారణ టికెట్ పొందేలా సదుపాయాలు

 *    రైల్ కమ్ రోడ్ టికెట్లను మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించటం

 *    రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయటం

 *    ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనల కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన

 *    భద్రత, సేవలకు సంబంధించి 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఫోన్ లైన్లు

 *    బోగీల ద్వారాలను వెడల్పు చేయటం, పెద్ద స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల అమరిక

 *    రైళ్లలో బెర్తుల ఆధునీకరణ, డిజైన్, నాణ్యత, శుభ్రతల ప్రమాణాల పెంపు

 *    స్లీపర్ బోగీల్లో పై బెర్తుల్లోకి ఎక్కేందుకు ఆధునిక మడత నిచ్చెన్ల అమరిక

 *    రైల్వే స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్త విభాగం ఏర్పాటు

 *    బోగీల్లోనూ చెత్తడబ్బాల ఏర్పాటు, రైలు బోగీల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు

 *    శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు, అన్ని రైళ్లలో మొబైల్ ఫోన్ చార్జింగ్ సౌకర్యాలు

 *    మహిళల భద్రత కోసం రైళ్లలో సీసీటీవీ కెమెరాలతో నిఘా

 *    9 రైల్వే కారిడార్లలో రైళ్ల వేగాన్ని 200 కిలోమీటర్ల వరకూ పెంచటం

 *    ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థను స్థాపించటం  

 

 అమ్మో.. ఎంత పొడుగో?

     ‘బండెనక బండి కట్టి..’ అన్నట్లు ఒకదాని వెనుక మరొకటి బోగీలతో రైళ్లు సాగిపోతూనే ఉంటాయి. మరి వాటి పొడవెంతుంటుందో తెలుసా?.. మన దేశంలో గూడ్స్ రైళ్లు 1.2 కిలోమీటర్ల వరకూ, ప్రయాణికుల రైళ్లు 600 మీటర్ల వరకూ ఉంటాయి. కానీ పశ్చిమ ఆస్ట్రేలియాలో బీహెచ్‌పీ సంస్థ ఏకంగా 682 వ్యాగన్లతో 7.35 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును నడిపింది. 8 ఇంజన్లను వాడిన ఈ రైలు ఏకంగా లక్ష టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించింది. దక్షిణాఫ్రికాలో 660 వ్యాగన్లతో 7.3 కి.మీ పొడవైన రైలును నడిపారు.. ఇది 16 ఇంజన్లతో 70 వేల టన్నుల సామగ్రిని మోసుకెళ్లింది. రష్యా కూడా 439 వ్యాగన్లతో 6.5 కిలోమీటర్ల పొడవైన రైలును నడిపింది. ఇక బెల్జియంలో 70 కోచ్‌లతో 1.8 కి.మీ. పొడవున్న ప్యాసింజర్  రైలును నడిపారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో 90 కోచ్‌లతో 1.2 కి.మీ. పొడవైన రైళ్లను నడుపుతారు.

 

 సామగ్రి మోసుకుపోవడానికి గూడ్స్ రైలు.. మనం వెళ్లడానికి ప్రయాణికుల రైలు.. కానీ ప్రత్యేకంగా రచయితల కోసమే ఒక రైలును నడుపుతారని తెలుసా? అమెరికాలో ‘ఆమ్‌ట్రాక్’ సంస్థ ‘ఆమ్‌ట్రాక్ రెసిడెన్సీ’ పేరిట ఈ రైలును నడుపుతుంది. కొన్ని నెలల పాటు వేలాది కిలోమీటర్ల దూరం సాగే ఈ ప్రయాణంలో రచయితలు ఎలాంటి బాదరబందీ లేకుండా ప్రశాంతంగా రచనలు చేసుకోవచ్చు. ప్రకృతి సోయగం, గ్రామీణ వాతావరణం, వివిధ ప్రాంతాలు, సంస్కృతుల మధ్య జరిగే ఈ రైలు ప్రయాణానికి అవకాశం ఉండేది మాత్రం కేవలం 24 మందికే. ఒక్కొక్కరికి రైల్లోనే ఒక గది, దానిలో బెడ్, రాసుకోవడానికి టేబుల్, భోజన సౌకర్యమూ ఉంటుంది. బాగా డిమాండ్ ఉండే ఈ ‘ఆమ్‌ట్రాక్ రెసిడెన్సీ’లో ప్రయాణం చేయాలంటే మనం రాసే రచనలతో పాటు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇలా ఈ సారి 16,000 దరఖాస్తులురాగా.. అందులోంచి 115 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఇంకా తుది 24 మందిని ఎంపిక చేయాల్సి ఉంది.

 

 ప్రభుత్వ సహకారం 40,000 కోట్లు!

 ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రైల్వే బడ్జెట్ వ్యయం రూ. 1,00,011 కోట్లు కాగా, అందులో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం రూ. 40 వేల కోట్లు ఉంది. అంటే మొత్తం రైల్వే బడ్జెట్‌లో ప్రభుత్వ స్థూల బడ్జెటరీ మద్దతు(జీబీఎస్) 41.6%. గత ఆర్థిక సంవత్సరం రైల్వేలకు ప్రభుత్వం ఇచ్చిన బడ్జెటరీ మద్దతు రూ. 30 వేల కోట్లు కాగా, ఈ ఏడాది అది భారీగా పెరిగి రూ. 40 వేల కోట్లకు చేరింది. మిగతా మొత్తంలో అంతర్గత వనరుల ద్వారా రూ. 17,793 కోట్లు, డీజిల్ సెస్ ద్వారా రూ. 1,645 కోట్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రూ. 17 వేల కోట్లు, ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య పథకాల ద్వారా రూ. 6 వేల కోట్లను సేకరించాలనుకుంటోంది. ఇవి పోనూ మిగతా నిధుల సేకరణలో ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఎల్‌ఐసీ తదితర కార్పొరేషన్ల సహకారం తీసుకోనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top