‘సూట్‌కేసు’లకన్నా సూటు బూటు సర్కారే మేలు

‘సూట్‌కేసు’లకన్నా సూటు బూటు సర్కారే మేలు - Sakshi


రాహుల్‌కు మోదీ జవాబు

న్యూఢిల్లీ : తనది సూటు బూటు సర్కారు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవహేళన చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ‘సూట్‌కేసుల సర్కారుకన్నా సూటు బూటు సర్కారు ఎంతో మేలు’ అని కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ ప్రధాని గట్టిగా చురక వేశారు. కాగా, వివాదాస్పదమైన భూ సేకరణ బిల్లు తనకేమీ జీవన్మరణ సమస్య కాదని ఆయన స్పష్టంచేశారు. ఈ అంశంపై ఎలాంటి సూచనలు వచ్చినా స్వీకరించడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు.



60 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు హఠాత్తుగా పేదల గురించి గుర్తుకొచ్చిందని ఎత్తిపొడిచారు. కాంగ్రెస్ పార్టీ అవకతవకల పాలన, సరైన విధానాలు లేకపోవడంవల్లే పేదలు ఎన్నో కష్టాలు పడ్డారని, వారు పేదలుగానే మిగిలిపోయారని పేర్కొన్నారు.  ఏఎన్‌ఎల్ వార్తా సంస్థ, ట్రిబ్యూన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన పలు అంశాలు మాట్లాడారు. బొగ్గు, స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాలవల్ల ఎవరు లాభపడ్డారో ప్రజలందరికీ తెలుసని మోదీ అన్నారు. కేవలం కొంతమంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లే కాంగ్రెస్ పాలనలో లాభపడ్డారని పేర్కొన్నారు.



కాగా, మరో సారి భూసేకరణ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేంద్ర కేబినెట్ శనివారం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయంలో ప్రధాని చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూసేకరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రైవేటు పరిశ్రమల విషయంలో ఈ బిల్లులో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top