పాక్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు

పాక్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు


- అసహనంపై చర్చలో సర్కారుపై రాహుల్ ధ్వజం


 


న్యూఢిల్లీ:  అసహనం అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని.. ఇటీవలి సంఘటనలతో కలత చెందిన వారు ఏం చెప్తున్నారో వినాలని హితవు పలికారు.


 


అసహనంపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నిరసన తెలుపుతున్న ఎంతోమందిలో నారాయణమూర్తి, రఘురామ్‌రాజన్, పి.ఎం.భార్గవ వంటి వారు ఉన్నారు. లక్షలాది మంది ఇతర జనం లాగానే వారు కూడా కలత చెందారు. వారిని గౌరవించండి.. వారిని కలతకు గురిచేస్తోందేమిటో అర్థంచేసుకోవటానికి ప్రయత్నం చేయండి. వెళ్లి వారు చెప్తున్నది వినండి’’ అని పేర్కొన్నారు.


 


రాహుల్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. హరియాణాలో సజీవదహనమైన ఇద్దరు దళిత చిన్నారుల మరణాన్ని.. కుక్కపై రాయి వేయటంతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వి.కె.సింగ్ అంశాన్ని రాహుల్ ప్రస్తావించినపుడు అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి సింగ్ ఆ సమయంలో సభలో లేరు. ‘మన ప్రధానమంత్రి ఈ మనిషిని మంత్రిగా కొనసాగిస్తున్నారు. ఆ ఇద్దరు చిన్నారులూ సజీవదహనం కాకుండా ఉండాలని.. అంబేడ్కర్ తన జీవితాన్నంతా వెచ్చించి రాజ్యాంగాన్ని రచించారు. ప్రధాని ఈ వైరుధ్యాన్ని చూడలేకపోయారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించగా.. ప్రతిపక్ష సభ్యులు ‘సిగ్గు.. సిగ్గు’ అని నినాదాలు చేశారు.


 


‘‘పాకిస్తాన్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. సహనంతో ఉండండి. మీ ప్రజల మాటలు వినండి. మీ సొంత ప్రజలను ఆలింగనం చేసుకోండి. ప్రజలకు మహాత్మా గాంధీ గళాన్ని అందించారు. పాకిస్తాన్ విఫలమైంది ఎందుకంటే.. వారి నాయకులు ప్రజల గొంతును అణచివేశారు.. హింసాత్మకంగా ప్రవర్తించారు. మనం తప్పుడు పాఠాలు నేర్చుకోకూడదు’’ అని రాహుల్ పేర్కొన్నారు.


 


ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాం...


అమీర్‌ఖాన్ అంశంపై బీజేపీ నేతలపై రాహుల్ విమర్శలు ఎక్కుపెడుతూ.. ‘‘ప్రధానమంత్రి ఆర్థిక ప్రగతి, పురోభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. అదే సమయంలో ఆయన సహచరులు కొంతమంది బాలీవుడ్ నటులను పాకిస్తాన్‌కు పంపించటం గురించి మాట్లాడుతుంటారు. మనం ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాం. వారిని చర్చలో భాగస్వాములను కానివ్వండి. మనం తప్పుడు పాఠం నేర్చుకోవద్దు (పాకిస్తాన్ నుంచి). వారి అతి పెద్ద బలహీనత అసహనం’’ అని వ్యాఖ్యానించారు.


 


ఎఫ్‌టీఐఐ విద్యార్థుల ఆందోళన గురించి ప్రస్తావిస్తూ.. ఎఫ్‌టీఐఐ విద్యార్థులు అడిగిందల్లా.. ఒక సాధారణ వ్యక్తిని సంస్థ అధిపతిగా చేయటంపై తమ అభిప్రాయం వినాలని మాత్రమే. అయినాకూడా ప్రభుత్వం వారి గొంతు నొక్కేసింది. నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గి వంటి హేతువాదులు హత్యకు గురయ్యాక కూడా ప్రధానమంత్రి ఏమీ మాట్లాడలేదని మండిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి అరుణ్‌శౌరీని.. ట్విటర్‌లో ప్రధానమంత్రిని అనుసరించే వాళ్లు అనుచిత విమర్శలతో వేధించటాన్నీ రాహుల్ విమర్శించారు. పక్షవాతంతో బాధపడుతున్న శౌరీ కుమారుడిని కూడా వాళ్లు వదిలిపెట్టలేదని నిరసించారు.


 


ఇది స్వప్నం కాదు.. వాస్తవం...


‘‘దాద్రీలో బీఫ్ తిన్నారన్న వదంతులపై ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను ప్రస్తావిస్తూ.. హతుడి కుమారుడు వైమానిక దళ సిబ్బంది అయినా కూడా ప్రధానమంత్రి మౌనంగానే ఉండిపోయారు. అతడికి రక్షణ కల్పించే బాధ్యత తుదిగా.. మౌనంగా ఉండిపోయిన ప్రధాని పైనే ఉంది’’ అని తీవ్రంగా విమర్శించారు.


 


రచయితలు, కళాకారుల నిరసనలను కల్పిత విప్లవంగా ప్రభుత్వం కొట్టివేయడాన్ని తప్పుపడుతూ.. వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం ఇష్టపడలేదని విమర్శించారు. ‘‘వారు దీనిని ఎందుకు కల్పిస్తారు? అరుణ్‌జైట్లీ గారూ.. ఇది మీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లాగా స్వప్నం కాదు.. ఇది వాస్తవం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మీపై నిరసనలను సృష్టించటం కన్నా నారాయణమూర్తి, రాజన్, భార్గవలకు వేరే పని లేదా?’’ అని ఎద్దేవా చేశారు.


 


రాజ్యాంగాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం...


రాజ్యాంగంపై అవగాహన పెంచేందుకు.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్యాంగాన్ని ఒక ఏనుగుపై ఉంచి దానితో కలిసి నడిచానని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన అలా నడవాలని మేం కోరుకోవటం లేదు.. (రాజ్యాంగాన్ని నిలబెట్టేందుకు) పని చేయాలని మేం కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాధూరాం గాడ్సేను దేశభక్తుడని బీజేపీ సభ్యుడు సాక్షి మహరాజ్ కీర్తించారని రాహుల్ పేర్కొనగా.. సభలోనే ఉన్న సదరు సభ్యుడు విభేదించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top