రాహుల్ శకం.. ఆరంభానికి ముందే అంతం?

రాహుల్ శకం.. ఆరంభానికి ముందే అంతం? - Sakshi


కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఆ పార్టీ నాయకులే చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ శకం మొదలైపోతోంది.. ఇక రాబోయేది రాహుల్ రాజ్యమేనంటూ భజన చేసిన ఆ పార్టీ నాయకులు.. ఇప్పుడు ఉన్నట్టుండి మాట మార్చారు. ప్రియాంకా గాంధీ వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టదని అడుగుతున్నారు. పార్టీలో ప్రియాంక శకం మొదలవుతోందంటూ ప్రచారం మొదలుపెట్టేశారు, పోస్టర్లు కూడా వేసేశారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలి ప్రాంతంలో ఆ మధ్య వేసిన కొన్ని పోస్టర్లలో సోనియాగాంధీ, ప్రియాంకల ఫొటోలు, వాళ్లకు సంబంధించిన నినాదాలు ఉన్నాయే తప్ప.. ఎక్కడా రాహుల్ గాంధీ ప్రస్తావన గానీ, ఆయన ఫొటో గానీ కనిపించిన పాపాన పోలేదు. దాంతో రాహుల్ శకం ఇంకా ప్రారంభం కావడానికి ముందే అంతం అయిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.



వాస్తవానికి రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ మీద ముందునుంచే చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు రాహుల్ బాబా ఎక్కడని అంతా వెతుకుతుంటే.. దాదాపు వారం రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోయి, ఆ తర్వాత ఎప్పుడో బయటకు వస్తారన్న విమర్శ ఉంది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో 'నిర్భయ'పై సామూహిక అత్యాచారం జరిగి, దేశమంతా గగ్గోలు పెట్టినప్పుడు రాహుల్ స్పందన ఏంటో అందరికీ తెలిసిందే. తాజాగా విశాఖపట్నం సహా మూడు ఉత్తరాంధ్ర జిల్లాలలను హుదూద్ తుఫాను అల్లకల్లోలం చేసినప్పుడు కూడా సరిగ్గా వారం రోజుల తర్వాత గానీ ఆయన రాలేదు. ఈనెల 12వ తేదీన తుఫాను తీరం దాటితే.. 19వ తేదీ నాడు గానీ ఆయన రాలేకపోయారు. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా వచ్చి, పర్యటించే తీరిక ఉంది గానీ, రాహుల్ బాబాకు మాత్రం అంత తీరిక ఎక్కడ ఉంటుందన్న జోకులు పేలాయి.



అందుకే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ శకం ఆరంభం కావడానికి ముందే అంతం అయిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో రాహుల్ గాంధీని మంత్రి పదవి చేపట్టాలని పిలిస్తే.. అప్పుడే తనకు అనుభవం చాలదని, తర్వాత చేపడతానని అన్నారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం, ఇంకా మాట్లాడితే, అవకాశాలను చేజిక్కించుకోవడం నాయకత్వ లక్షణం. అది లేకపోవడం వల్లే రాహుల్ శకం ముగిసిందని అంటున్నారు. ఇక ప్రియాంక శకం ఎలా సాగుతుందో.. ఎన్నాళ్లుంటుందో చూడాల్సిందే.


(ఇంగ్లీషు కథనం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top