గద్దెనెక్కి వందరోజులైనా నల్లధనాన్ని తీసుకురాలేదేం?

గద్దెనెక్కి వందరోజులైనా నల్లధనాన్ని తీసుకురాలేదేం? - Sakshi


బీజేపీపై రాహుల్ గాంధీ ధ్వజం

పాంకీ (జార్ఖండ్): అధికారంలోకి వచ్చి వందరోజులైనా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని రప్పించడంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పాలమావ్ జిల్లా పాంకీలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... నల్లధనాన్ని తెప్పించడంలో విఫలమైందని కాంగ్రెస్‌ను ఎగతాళి చేసిన బీజేపీ ఇప్పుడు తానేం చేస్తోందని ఎద్దేవా చేశారు. విదేశీ బ్యాంకులనుంచి నల్లధనాన్ని తెప్పించడంలో బీజేపీ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. నల్లధనం విషయంలో అనేక దౌత్య కారణాలు ఆలస్యానికి కారణమయ్యాయనీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అవే కారణాలు చెబుతోందని తెలిపారు.



పరిపాలన చేయాలంటే చాలా ఓపిక కావాలనీ, బీజేపీకి ఆ గుణం లేదనీ విమర్శించారు. మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడం పరిపాలన కాదన్నారు. పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలనే ఆలోచన, స్పృహ ప్రజల్లో కలిగించాలే తప్ప వారి చేతుల్లో చీపుర్లు పెడితే ప్రయోజనం ఉండదని ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంపై వ్యాఖ్యానించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 ఏళ్లలో తొమ్మిదేళ్లు బీజేపీయే అధికారంలో ఉందనీ, అవినీతిని పెంచి పోషించిందనీ విమర్శించారు. జార్ఖండ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top