రోహిత్ ను కూడా దేశద్రోహి అన్నారు

రోహిత్ ను కూడా దేశద్రోహి అన్నారు - Sakshi


న్యూఢిల్లీ: 'ఈ దేశంలో భిన్న వాదనలు వినిపించడం నేరమైపోయింది. హక్కుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరినీ దేశ ద్రోహులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోంది. కొద్ది రోజుల కిందట హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లాను. అతని స్నేహితులు, కుటుంబసభ్యులు నాకు చెప్పినదాన్నిబట్టి రోహిత్ ను కూడా దేశద్రోహిగా చిత్రీకరించారు. ఓ విద్యార్థి తన మనోభావాన్ని వ్యక్తపర్చినంత మాత్రాన దేశద్రోహి అవుతాడా?'



అంటూ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగిచారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. శనివారం సాయంత్రం వర్సిటీకి చేరుకున్న ఆయనకు ఓ విద్యార్థి వర్గం నల్లజెండాలతో నిరసన తెలిపింది. మరో వర్గం విద్యార్థులు నిర్వహిస్తోన్న ఆందోళనకు మద్దతు పలికిన రాహుల్.. విద్యార్థులను దేశద్రోహం కేసుపై అరెస్టుచేయడాన్ని ఖండించారు.



'నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కొందరు నా ముఖంపై నల్లజెండాలు ఎగురవేశారు. ఆ చర్య నాకు సంతోషం కల్గించింది. ఎందుకంటే నన్ను వ్యతిరేకించేవారు తమ నిరసనను తెలియజేశారు. అది వారి హక్కు. ఇలాంటి హక్కే అందరికీ ఉంటుంది. ఎవరికివారు విభిన్నవాదనలు, విభిన్న ఆలోచనలు కలిగిఉన్నంతమాత్రాన వారిని తప్పుపట్టలేం' అని రాహుల్ వ్యాఖ్యానించారు.


 


హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను అణిచివేస్తున్నవారే నిజమైన దేశద్రోహులని, ఇలాంటి చర్యల ద్వారా వారు మనల్ని(ఆందోళనకారుల్ని) మరింత సంఘటితపరుస్తున్నారని, గొంతువిప్పి స్వేచ్ఛగా తమ భావాలు చెబుతోన్న వ్యక్తులంటే ప్రభుత్వం భయపడుతున్నదని రాహుల్ గాంధీ అన్నారు. జేఎన్ యూ విద్యార్థుల స్వరంతో 100 కోట్ల మంది ఏకీభవిస్తారని, అవతలివారి వారు ఉద్దేశపూర్వకంగా నెలకొల్పిన ఉద్రిక్తతలకు ఆవేశపడొద్దని విద్యార్థులకు హితవుపలికారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top