యూపీ సీఎం అభ్యర్థిగా రాహుల్!?

యూపీ సీఎం అభ్యర్థిగా రాహుల్!? - Sakshi


♦ బ్రాహ్మణుల నుంచే అభ్యర్థి? ..రాహుల్ లేదా ప్రియాంక

♦ కాంగ్రెస్ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన

 

 న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పునర్వైభవం కోసం భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ సిద్ధమైంది. 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం వచ్చే 15 రోజుల్లో కీలక నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు సీఎం అభ్యర్థిగా బ్రాహ్మణ వర్గం వ్యక్తిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే జరిగితే గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్‌కు గాని, ప్రియాంకకు గాని ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని పార్టీలోని కొన్ని వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 



గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్ బాధ్యతల్ని తీసుకుంటే మంచిదని పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా భావిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే ... బ్రాహ్మణ వర్గానికి చెందిన చురుకైన నేతను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై ఇంతవరకూ కాంగ్రెస్ నుంచి స్పందనలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున గాంధీ కుటుంబం నుంచి ఎవరినీ నిలబెట్టేందుకు ఆ పార్టీ ఇష్టపడడం లేదు. ఏదేమైనా మే 19 తర్వాతే పార్టీ నాయకత్వ ప్రక్షాళనపై నిర్ణయం వెలువడవచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.



 బ్రాహ్మణ ఓటర్లే లక్ష్యం..: రాష్ట్ర ఓటర్లలో 10 నుంచి 12 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గంపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అందువల్ల ఆ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా బ్రాహ్మణ ఓటర్లు మండల్- మందిర్ రాజకీయాలతో బీజేపీవైపు మొగ్గుచూపారు.  పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, ఏఐసీసీ పరిశీలకుల్ని కూడా మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ  ఇన్‌చార్జ్‌గా ఢిల్లీ మాజీ  సీఎం షీలా దీక్షిత్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ నియమించుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి, గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు కిశోర్ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top