స్వచ్ఛభారత్లో ప్రియాంక వైవిధ్యం!

స్వచ్ఛభారత్లో ప్రియాంక వైవిధ్యం! - Sakshi


స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే, అక్కడక్కడ ఉన్న కొంత చెత్తను చీపురు పట్టుకుని ఊడవడం తప్ప వాస్తవంగా పూర్తిస్థాయిలో కార్యక్రమ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నవాళ్లు తక్కువే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఈ విషయంలో అందరి కంటే ఓ అడుగు ముందుకేసింది. ముంబైలోని వెర్సోవా సమీపంలో పూర్తి చెత్తకుప్పలతో నిండి ఉన్న ప్రాంతాన్ని ఆమె ఎంచుకుంది. ఆ ప్రాంతంలో ఒకటి, రెండు రోజులు కాకుండా మొత్తం 16 రోజుల పాటు తన బృందంతో కలిసి చెత్త మొత్తాన్ని శుభ్రం చేయించింది. అక్కడ వాతావరణం అంతటినీ సమూలంగా మార్చేసింది.


మొక్కలు నాటించి, ఇళ్లకు రంగులు వేయించి, అక్కడ అందరికీ అవగాహన పెంచింది. తాను అనుకున్న సమయం కంటే కొంచెం ఎక్కువే పట్టిందని, స్వచ్ఛభారత్ చేపట్టిన వాళ్లలోని నవరత్నాల్లో ఒకరిగా ఉండాలని ప్రధాని తనకు చెప్పారని, దాంతో తాను చాలా ఉద్వేగానికి గురయ్యానని అన్నారు. అప్పుడే.. సుదీర్ఘకాలం పాటు ఉండేలా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని అనుకున్నానని ప్రియాంక చెప్పారు. అగ్నిపథ్ సినిమా షూటింగ్ సమయంలో తాను చూసిన వెర్సోవా ప్రాంతాన్ని ఆమె ఎంచుకున్నారు.



పిల్లలు చెత్తకుప్పల మీదే ఆడుకోవడం అప్పట్లో చూశానని, అందుకే కేవలం శుభ్రం చేయడంతో సరిపెట్టకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని మార్చేయాలనుకున్నానని తెలిపారు. తాను ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మరికొందరిని కూడా ఆమె నామినేట్ చేశారు. వారిలో విక్రమ్జిత్ సాహ్నీ, సన్ ఫౌండేషన్, దర్శకుడు మధుర్ భండార్కర్, సిద్ధార్థ రాయ్ కపూర్, ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రణయ్ రాయ్, విక్రమ్ చంద్ర, ఎన్డీటీవీ బృందం, ముంబైలోని టాక్సీ, ఆటోరిక్షా యూనియన్లు, లయన్స్ క్లబ్ ఆఫ్ ముంబై.. ఇలాంటి సంస్థలు ఉన్నాయి.

 

ప్రియాంక ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా అభినందించారు. ప్రియాంకా చోప్రా చాలా సృజనాత్మకంగా చేశారని, ప్రజలందరినీ ఒక్కచోటుకు చేర్చి స్వచ్ఛభారతాన్ని సృష్టించడానికి ఇది చాలా అద్భుతమైన మార్గమని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top