భ్రమలు తొలగుతున్నాయ్!

భ్రమలు తొలగుతున్నాయ్! - Sakshi


మోడీ సర్కార్ పనితీరుపై సీఎం చవాన్ విమర్శ



ముంబై: నరేంద్ర మోడీ సర్కార్ పనితీరుపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నరేంద్రమోడీ కాస్తా మౌనేంద్ర మోడీ అయ్యారంటూ విమర్శించారు. మోడీ ప్రభుత్వంపై ఉన్న భ్రమలు ఇప్పుడిప్పుడే తొలగతున్నాయని, ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడమే అందుకు నిదర్శనమన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీపై, ఎన్డీయే ప్రభుత్వ పనితీరుపై చవాన్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

 

వివరాలు ఆయన మాటల్లోనే... ‘గుజరాత్‌లో మోడీ పాలన నిరంకుశంగా సాగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఢిల్లీలో కూడా అటువంటి పాలనే కొనసాగుతోంది.  మోడీ అధికారంలోకి వస్తే నిరంకుశ పాలనను ఎదుర్కోవాల్సిందంటూ ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మోడీ ప్రభుత్వంలో మంత్రులకు విలువ లేకుండా పోతోంది. ఆయన కూడా అన్ని విషయాలకు మౌనమే సమాధానమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కీలక విషయాలపై కూడా మోడీ నోరు విప్పడంలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా తమ ప్రభుత్వ విధానం ఇలా ఉంటుందంటూ మోడీ చెప్పలేదు.

 

విదేశాంగ విధానం గురించి కూడా ఎన్డీయే ప్రభుత్వం తన విధానమేంటో వెల్లడించలేదు. సామాజిక సమస్యలు, ఆర్థిక వ్యవహారాల కూడా మోడీ వైఖరి ఏమిటో ఇప్పటికీ స్పష్టం కావడంలేదు. వారికి ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయం శిరోధార్యంగా మారింది. కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్మేందుకు ప్రత్యర్థి కంపెనీల ఉత్పత్తులపై విమర్శలు చేసి అమ్ముకుంటాయి. అధికారంలోకి వచ్చేందుకు మోడీ కూడా ఎన్నిలకు ముందు కాంగ్రెస్‌పై విమర్శలు చేసి ప్రధాని అయ్యారు. మోడీ పాలనను, కాంగ్రెస్ పాలనతో బేరీజు వేసుకోవడం ప్రజలు అప్పుడే మొదలుపెట్టారు. మోడీ పాలన నుంచి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని ఆశించలేం.

 

మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలేవీ ప్రజోపయోగంగా ఉండడంలేదు. ఆయన ప్రజల పక్షాన నిలిచి ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత నిరంకుశంగా ఉంటున్నాయో తెలిసేది. కానీ ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అందుకే ప్రజా సమస్యలు ఆయనకు కనిపించడంలేదు. ట్విటర్‌లో గొప్ప గొప్ప రాతలు కనిపిస్తున్నాయి. నిజానికి అవి మోడీ రాస్తున్నారో... లేక ప్రతిభావంతులైన మరే ఇతర అధికారులు రాస్తున్నారో తెలియడంలేదు. బీజేపీలో ప్రతిభావంతులకు కొదవలేదు. అయితే మోడీ మాత్రం వారిని ఉపయోగించుకోవడానికి సందేహిస్తున్నారు. మంత్రులను అనుమానించే సంస్కృతి బీజేపీలో ఇటీవలే బయటపడింది. గుజరాత్‌తో పోలిస్తే మహారాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువ. ఏ రకంగా చూసిన మహారాష్ట్ర, గుజరాత్ కంటే ముందంజలోనే ఉంద’న్నారు.

 

ఎన్సీపీతో కలిసే ఎన్నికలకు...

భాగస్వామ్య పార్టీ ఎన్సీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మరోసారి స్పష్టం చేశారు. మతతత్వ పార్టీలను ఎదుర్కోవాలన్నా, సెక్యులర్ ఓట్లు చీలకుండా ఉండాలన్నా మరోసారి కూటమిగానే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్నారు.  కాంగ్రెస్, ఎన్సీపీలు పోట్లాడుకుంటే ప్రయోజనం పొందేవి మతతత్వ పార్టీలేనని, వాటికి ఆ అవకాశం ఇవ్వబోమని చవాన్ స్పష్టం చేశారు.  అయితే ఇటీవల మంత్రిపదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణేపై విమర్శలు చేసేందుకు  ఆయన నిరాకరించారు.

 

రాష్ట్ర ప్రజల క్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్లాలని, సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లడం సరికాదంటూ సున్నితంగా చురకలంటించారు. ఇక సీట్ల పంపకాల గురించి మాట్లాడుతూ.. ఎన్సీపీతో సీట్ల పంపకాలపై చర్చలు సరైన సమయంలోనే జరుగుతాయన్నారు. ఇప్పటికే సూచనప్రాయంగా ఒప్పందం కుదిరిందని, దాదాపుగా అదే ఖరారవుతుందన్నారు. అయితే ఈ ఒప్పందం ఒకరికొకరు సహకరించుకునేలా ఉంటుందని మాత్రమే చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top