అవినీతి వ్యవస్థీకృతమైంది!

అవినీతి వ్యవస్థీకృతమైంది! - Sakshi


► సామాన్యుల కష్టాలను తొలగించేందుకు మరిన్ని కార్యక్రమాలు

► యువ వాణిజ్యవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ




న్యూఢిల్లీ: దేశంలో క్షేత్రస్థాయి వరకు వేళ్లూనుకుపోయిన అవినీతిని పెకిలించి వేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. సామాన్యుల కష్టాలను తొలగించేందుకు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో ‘చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌’ పేరుతో జరిగిన కార్యక్రమంలో 200 మంది యువ స్టార్టప్‌ వా ణిజ్యవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు.


‘అవినీతి వ్యవస్థీకృతమైంది. వ్యతిరేకంగా ఏర్పాట్లు చేయకపోతే.. దీన్ని ఆపటం కష్టం. దళారుల వ్యవస్థను చాలా మటుకు తగ్గించాం. వాళ్లే ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోతోందంటున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కార్యక్రమాల వల్లే నవ భారత నిర్మాణం జరగదని.. ప్రతి భారతీయుడు మార్పుకోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.  



స్టార్టప్‌ల ప్రెజెంటేషన్‌

యువ వ్యాపారవేత్తల్లో సృజనాత్మకత పెంచటం, ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచించేందుకు ఈ ‘చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌’ కార్యక్రమాన్ని ఏడాదికోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యాపారవేత్తల్లోని వివిధ వర్గాలను ఆయా మంత్రిత్వ శాఖలకు శాశ్వత పద్ధతిలో జోడించామని ప్రధాని తెలిపారు. ఈ యువ వాణిజ్యవేత్తలు సాఫ్ట్‌ పవర్, ఇంక్రెడిబుల్‌ ఇండియా 2.0, విద్య–నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం–పౌష్టికాహారం, డిజిటల్‌ ఇండియా, 2022 కల్లా నవభారతం ఇతివృత్తాలతో ప్రజెంటేషన్‌ ఇచ్చారు.


వీరి కొత్త ఆలోచనలను ప్రధాని అభినందిం చారు. కొత్త ఆలోచనలను వ్యవస్థీకృతం చేసేందుకు అన్ని సాధ్యమైన మార్గాల్లో ప్రయత్నిస్తామన్నారు. స్టార్టప్‌ల ద్వారా ఈ గ్రూపులు మరిన్ని కొత్త ఆలోచనల కోసం పోటీపడాలని అందుకు తమ ప్రోత్సాహం ఉం టుందని మోదీ చెప్పారు. సామాజిక సంక్షేమ పథకాలను ప్రమోట్‌ చేసేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.  



చిన్న మార్పులతో భారీ ఫలితాలు

తమ ప్రభుత్వం తీసుకొస్తున్న చిన్న చిన్న మార్పులు స్పష్టమైన ఫలితాలనిస్తున్నాయని ప్రధాని తెలిపారు. సామాన్యులకు సమస్యల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం సర్టిఫికెట్లకు సెల్ఫ్‌ అటెస్టేషన్‌ చేయటం, కిందిస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేయటం వంటి కార్యక్రమాలను చేపట్టిందని మోదీ పేర్కొన్నారు. సీనియర్‌ అధికారుల బృందం ప్రజల సౌకర్యాలను పెంచేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తోందన్నారు. ‘గతంలో మంత్రుల ప్రతిపాదనల ఆధారంగా పద్మ అవార్డులు ఇచ్చేవారు.


మేం దీనికి చిన్న మార్పు చేశాం. బహిరంగ నామినేషన్లను ఆహ్వానించాం. ఎవరైనా సరైన వ్యక్తులను ఈ అవార్డులకు సిఫారసు చేయవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. నవభారత నిర్మాణంలో ప్రజలతో కలిసి ముందుకెళ్లనున్నట్లు ప్రధాని పునరుద్ఘాటించారు. ‘మనలో ప్రతి ఒక్కరూ దేశభక్తులే. దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నవారే. దేశంపై ప్రేమ విషయంలో మన మధ్య ఎలాంటి తేడాల్లేవు’ అని ప్రధాని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగడియా, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top