అట్టహాసంగా కోవింద్‌ నామినేషన్‌

అట్టహాసంగా కోవింద్‌ నామినేషన్‌ - Sakshi

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మూడు సెట్లు దాఖలు

- బలపరిచిన ప్రధాని మోదీ, అమిత్‌ షా, మిత్రపక్షాల సీఎంలు

28 పార్టీల నేతలు, 15 రాష్ట్రాల సీఎంల హాజరు.. శివసేన గైర్హాజరు

 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, 15 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ అట్టహాసంగా రాష్ట్రపతి పదవికి నామినేషన్‌ వేశారు. ఎన్డీఏ, ఎన్డీఏయేతర పార్టీల ముఖ్యనేతల హాజరుతో శుక్రవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయంలో జరిగిన నామినేషన్‌ పర్వం బీజేపీ బలప్రదర్శన వేదికను తలపించింది. కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి సెట్‌ నామినేషన్‌ పత్రంపై మోదీ సంతకం చేయగా, అద్వానీ సహా 60 మంది బలపరిచారు. రెండో సెట్‌ను బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో మరి కొందరు నేతలు ప్రతిపాదించారు. బీజేపీ మిత్రపక్షాల నేతలు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్,  చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరు నేతలు మూడో సెట్‌పై సంతకాలు చేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రాకు నామినేషన్‌ పత్రాలు అందచేశారు. జూన్‌ 28న నామినేషన్ల చివరి తేదీన నాలుగో సెట్‌ దాఖలు చేస్తారు.  28 పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని బీజేపీ తెలిపింది.  కోవింద్‌కు మద్దతు ప్రకటించిన శివసేన గైర్హాజరు కాగా.. తమకు ఆహ్వానం అందలేదని పేర్కొంది. 

 

పరీకర్, ముఫ్తీ మినహా ఎన్డీఏ సీఎంలందరూ హాజరు

గోవా సీఎం పరీకర్, కశ్మీర్‌ సీఎం ముఫ్తీ మినహా బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏయేతర ముఖ్య మంత్రుల్లో తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, తమిళనాడు సీఎం పళనిస్వామిలు హాజరయ్యారు. బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీలు కూడా హాజరయ్యారు. బీజేడీ తరఫున ఒడిశా మంత్రి హాజరుకాగా.. జేడీయూ నుంచి ఎవరూ పాల్గొనలేదు. 

 

దేశ సమగ్రాభివృద్ధికి కృషి.. కోవింద్‌: నామినేషన్‌ అనంతరం కోవింద్‌ మాట్లాడుతూ ‘రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమని నా నమ్మకం. అందుకు నా వంతు ప్రయత్నిస్తా. సాధ్యమైనంతమేరకు దేశ అత్యున్నత కార్యాలయం గౌరవం కాపాడతా.. దేశ సమగ్రాభివృద్ధికి, యువత ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు కృషిచేస్తా.. ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులంతా మద్దతివ్వాలని కోరుతున్నా’నని పేర్కొన్నారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top