అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి, ప్రధాని


విశాఖపట్నం:తూర్పుతీరప్రాంతంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు ప్రముఖులు హాజరవుతారని తూర్పు నావికా దళ ఛీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్‌సోనీ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఇవి ప్రారంభమై 8వ తేదీతో ముగియనున్నాయన్నారు. ఇక్కడి తీరరక్షక దళంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ సాగరతీరంలో జరగనున్న ఈ యుద్ధ నౌకల విన్యాసాలను వీక్షించేందుకు ఆదేనెల ఏడో తేదీన ఉదయం రాష్ట్రపతి, సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారన్నట్లు తెలిపారు.


 


స్వాతంత్య్రం వచ్చాక ముంబయి వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరగ్గా తూర్పుతీరంలో జరగడం ఇదే తొలిసారన్నారు. విన్యాసాలకు ముందురోజు ఏయూగ్రౌండ్స్‌లో దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామన్నారు.



తీరరక్షణకు మరో నౌక రాణి దుర్గావతి....



తీర రక్షణకు మరో నౌక ఐసిజిఎస్ రాణి దుర్గావతి సిద్ధమైంది. ఈ నౌకను తూర్పు నావికా దళ చీఫ్ వైస్‌ఆడ్మిరల్ సోమవారం ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ షిప్‌యార్డ్ దీనిని నిర్మించి తీరపరిరక్షణ దళానికి అందించింది. 51 మీటర్ల పొడవుతో 4000సిరీస్ డీజిల్ ఇంజన్లతో 34నాటికన్ మైళ్ళ వేగంతో దూసుకుపోగలదు. ఏకధాటిగా1500నాటికన్ మైళ్ళ పాటు ప్రయాణించగలదు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కోస్ట్‌గార్డ్ తూర్పుప్రాంత కమాండర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్‌పి శర్మ మట్లాడుతూ 2094 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని.. 4.25లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్ధిక మండలిని తూర్పు ప్రాంత రక్షక దళం పహారా కాస్తుందన్నారు.


 


పాత నౌకల స్థానంలో కొత్తవి నిర్మించి ఇవ్వడానికి షిప్‌యార్డ్‌లు ముందుకు వచ్చాయన్నారు. తీరప్రాంత రక్షణ దళం బాధ్యతలకు అనుగుణంగా సాంకేతికను పెంపొందించుకుంటుందన్నారు. వైస్‌ఆడ్మిరల్ సతీష్‌సోనీ మాట్లాడుతూ తీరప్రాంత రక్షణ దళం, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లతో తూర్పు నావికా దళ పరస్పర సహకారం మరింత పెరిగిందన్నారు. తూర్పు నావికా దళం న్యూక్లియర్ జలాంతర్గామితో శక్తివంతమయినదిగా ఎదిగిందన్నారు. తీరపరిరక్షణలో కస్టమ్స్, మెరైన్ పోలీస్, పోలీస్ సహకారంతో సర్వసన్నధ్దంగా ఉన్నామని ఈఎన్‌సీ చీఫ్ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top