మార్నింగ్ వాక్ వద్దంటున్న వైద్యులు

మార్నింగ్ వాక్ వద్దంటున్న వైద్యులు


ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాయుకాలుష్యం

న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయాన్నే లేచి నడక, వర్కవుట్లు చేయడమో సర్వసాధారణం. అయితే ఈ చలికాలంలో అటువంటిమేమీ చేయొద్దని, ఒకవేళ చేస్తే ఆరోగ్యం సంగతి దే వుడెరుగు, అనారోగ్యం బారినపడడం తథ్యం. ఉదయపు వేళల్లో వీచే గాలి తాజాగా ఉంటుందని, అందువల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతామని అందరూ భావిస్తారు. ఈ ఆలోచన ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో కానీ జాతీయ రాజధానిలో  మాత్రం అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది.



ఊపిరితిత్తులకు ముప్పుగా పరిణమించే కాలుష్య కారకాలు గాలిలో సమ్మిళితమయ్యాయి. ఈ కారణంగా మీ ఊపిరితిత్తుల పనిసామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోవడం తథ్యమని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు. మార్నింగ్ వాక్ చేయడమంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనంటున్నారు. అందువల్ల ఉదయం పూట ఇంటికే పరిమితం కావాలని హితవు పలుకుతున్నారు. సాధారణంగా అయితే ఉదయం పూట గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ కలుషితమవుతుంది.

 

అయితే నగరంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నగరంలోని దుమ్మధూళి కణాల స్థాయి ఉదయం వేళల్లోనే 2.5 శాతంగా నమోదవుతోంది. ఉదయం ఆరు గంటలనుంచి పది గంటలవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగమంచు కారణంగా దృశ్యస్పష్టత తగ్గిపోతుందని, ఇందువల్ల కళ్లపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ఈ విషయమై నగర వాతావరణ శాఖ అనుబంధ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చి సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త గుఫ్రాన్‌బేగ్ మాట్లాడుతూ ‘సాయంత్రం ఏడు గంటలనుంచి ఉదయం ఏడు గంటలవరకూ నగర వాతావరణంలో ధూళికణాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఉదయం పదిగంటలదాకా కొనసాగుతోంది’అని అన్నారు.

 

వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు: కేంద్ర మంత్రి జవదేకర్

న్యూఢిల్లీ: నగరంలో వాయుకాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేక ర్ గురువారం రాజ్యసభకు తెలియజేశారు. వాయుకాలుష్యం పెరుగుదల నగరంలో మరణాల సంఖ్యను పెంచుతుండడంపై అనేకమంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాయుకాలుష్య నియంత్రణ, మరణాల శాతం  తగ్గింపునకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాలుష్య శుద్ధికి సంబంధించిన ఉత్పత్తులకు ప్రోత్సాహమిస్తామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top