లైంగిక వేధింపులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?: లోక్‌సభలో పొంగులేటి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - Sakshi


న్యూఢిల్లీ:  పాఠశాలలు, యూనివర్సిటీలలో విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని  వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. గత మూడేళ్లలో నమోదైన కేసులు ఎన్నో కూడా తెలియజేయాలని ఈ రోజు లోక్సభలో ఆయన అడిగారు. ఈ ప్రశ్నలకు  కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి రాంశంకర్ కథేరియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పాఠశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థినులపై లైంగికవేధింపుల కేసులు పెరుగుతున్నట్లు తమకు ఎలాంటి నివేదికలు అందలేదన్నారు.



2012  డిసెంబర్16న ఢిల్లీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం తర్వాత అన్ని కళాశాలల్లో లైగింక వివక్షతపై చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని యూజీసీ నిర్ణయించినట్టు తెలిపారు. 'సాక్ష్యం'  పేరిట నిర్వహించే కార్యక్రమాల్లో సీనియర్ అధ్యాపకులు సభ్యులుగా ఉండేలా ఆయా యూనివర్సిటీల వీసీలు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.



అదేవిధంగా, ఖాదీ అమ్మకాలకు సంబంధించి అడిగిన మరో ప్రశ్నకు సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ భారతఖాదీకి సంబంధించి  అంతర్జాతీయ ట్రేడ్‌మార్క్ కోసం ప్రపంచ మేధావుల ఆస్తి సంస్థల్లో ఎలాంటి దరఖాస్తు చేయలేదని వెల్లడించారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top