విదర్భ బీజేపీలో ‘సీఎం’ రగడ!


* ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్న దేవేంద్ర, గడ్కరీ

* దేవేంద్ర వైపే అధిష్టానం మొగ్గు

* గడ్కరీ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న ‘విదర్భ’ నాయకులు


సాక్షి, ముంబై: సీఎం పదవి విదర్భ బీజేపీలో చిచ్చురేపుతోంది. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు సీఎం రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం విదర్భకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్‌వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. కాగా, విదర్భలో బీజేపీకి ఎక్కువ స్థానాలు లభించేలా కీలకపాత్ర పోషించిన నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం విశేషం. అయితే బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే విధంగా విదర్భకు చెందిన గడ్కరీ అనుకూలురైన సుధీర్ మునిగంటివార్, వినోద్ తావ్డే, కృష్ణ కోపడే వంటి నాయకులు గడ్కరీ పేరును సీఎం పదవికి పరిశీలించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండటం విశేషం. అలాగే విదర్భ నుంచి ఎన్నికైన 44 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సైతం నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం విశేషం. వీరంతా తమ శాయశక్తులా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు యత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయనే చెప్పవచ్చు. ఎందుకంటే అధిష్టానం ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంగా చేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

 

గడ్కరీ కోసం రాజీనామా చేస్తా : కృష్ణ కోపడే

నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని తనతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరూ కోరుకుంటున్నారని కృష్ణ కోపడే పేర్కొన్నారు. ఆయన పోటీచేసేందుకు వీలుగా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కృష్ణ కోపడే  తూర్పు నాగపూర్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

విదర్భలో గ్రూప్‌లుగా చీలిన బీజేపీ..?

విదర్భలో బీజేపీ రెండు గ్రూప్‌లుగా చీలిపోయిందని తెలుస్తోంది. ఒకవైపు విదర్భకే చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కానున్నారన్న ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ అదే ప్రాంతానికి చెందిన నితిన్ గడ్కరీ ఇంకా రేసులో ఉండటం గమనార్హం. నితిన్ గడ్కరీని సీఎం చేయాలని కోరుతున్నవారందరూ విదర్భకి చెందిన వారే కావడం విశేషం. దీంతో విదర్భలో బీజేపీ దేవేంద్ర ఫడ్నవిస్, నితిన్ గడ్కరీ గ్రూపులుగా చీలిపోయిందన్న వాదనలకు బలం చేకూరుతోంది.

 

శివసేనకే ఎక్కువ నష్టం..

పాతికేళ్ల పాటు కొనసాగిన మహా కూటమి బీటలు వారిన మీదట బీజేపీకన్నా ఎక్కువ నష్టం వాటిల్లింది శివసేనకేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో అన్ని పార్టీలు ఒంటరిపోరుకు దిగిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలోని సుమారు 50 నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. అయితే గత ఎన్నికల్లో శివసేన గెలుచుకున్న 13 స్థానాలను ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.కాగా, గత ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో ఉన్న ఒకే ఒక స్థానాన్ని శివసేన కైవసం చేసుకుంది. దీంతో ఎక్కువ నష్టపోయింది శివసేనేనని స్పష్టమవుతోంది. 2009 ఎన్నికల్లో బీజేపీ 46, శివసేన 44 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సారీ పొత్తు బెడసి కొట్టడంతో వేర్వేరుగా పోటీచేసినప్పటికీ ఇందులో శివసేన గెలిచిన 44 సీట్లలో నుంచి 13 సీట్లు బీజేపీ తమవైపు లాక్కుంది. అదేవిధంగా బీజేపీ గెలిచిన 46 సీట్లలో కేవలం భివండీ గ్రామీణ నియోజకవర్గాన్ని శివసేన చేజిక్కించుకోగలిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top