జ్యుడీషియల్ కస్టడీకి రాంపాల్

జ్యుడీషియల్ కస్టడీకి రాంపాల్


వివాదాస్పద స్వామీజీని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

28వ తేదీన తదుపరి విచారణ

రాంపాల్ అరెస్ట్‌పై సమగ్ర నివేదిక కోరిన కోర్టు


 

చండీగఢ్: హర్యానాకు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్‌ను పోలీసులు గురువారం పంజాబ్, హర్యానా హైకోర్టులో హాజరుపరిచారు. ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, 2006 నాటి హత్యాకేసుకు సంబంధించి రాంపాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. రాంపాల్ అరెస్ట్ కోసం నిర్వహించిన ఆపరేషన్ తాలూకు పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. రాంపాల్‌కున్న ఆస్తుల వివరాలతో ఒక నివేదిక అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో మత కేంద్రాలైన ‘డేరా’ల్లో అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వచేయడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం రాంపాల్‌ను తాజాగా నమోదైన దేశద్రోహం, హత్య, ఆశ్రమం వద్ద హింసాకాండ తదితర నేరారోపణలపై పోలీసులు హిస్సార్ కోర్టుకు తీసుకువెళ్లారు.



ఆరుగురు మరణించడం సహా గత రెండు రోజులుగా ఆశ్రమంలో జరుగుతున్న ఘటనలపై తాజాగా రాంపాల్, ఆయన అనుచరులపై పోలీసులు 35 కేసులను నమోదు చేశారు. కొన్ని కేసుల దర్యాప్తునకు గానూ హిస్సార్ ఎస్పీ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఆశ్రమ వ్యవహారాల్లో మావోయిస్టుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలితే.. దానిపై కూడా క్షుణ్ణంగా విచారణ జరుపుతామని హర్యానా డీజీపీ వశిష్ట్ తెలిపారు.



తప్పుడు ఆరోపణలు: రాంపాల్



కోర్టుకు హాజరుపర్చేముందు స్వామి రాంపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని స్వామి రాంపాల్ పేర్కొన్నారు. కోర్టు హాల్లో మాత్రం ఆయన మౌనంగా ఉన్నారు. బుధవారం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న రాంపాల్‌కు చెందిన సత్లోక్ ఆశ్రమం నుంచి అనుచరులందరినీ పోలీసులు ఖాళీ చేయించి, క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మీడియాను ఆశ్రమంలోకి అనుమతించారు.

 

స్నానం పాలతో.. ప్రసాదం!



హిస్సార్: అరెస్ట్ అనంతరంరాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భక్త కబీరు ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించుకున్న రాంపాల్.. భక్తులకు రోజూ అందించే ప్రసాదం ఏంటో తెలుసా?. పాలతో స్నానం చేసి.. ఆ పాల తో ఖీర్ తయారుచేయించి, భక్తులకు క్షీరామృతంగా అందిస్తా రు. హర్యానాలోని బల్వారాలో 12 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటైనఈ ఆశ్రమం ఆధునిక హంగులతో అలరారుతూ ఉంటుం ది. భారీ స్విమింగ్ పూల్, ఎసీ గదులు, ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో లెక్చర్ హాళ్లు ఉన్న ఆధునిక ఆశ్రమం అది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా భారీ గానే సమకూర్చుకున్నారని సమాచారం. తమను అర్థనగ్నంగా ఉండాలనిమేనేజ్‌మెంట్ వేధించిందని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన మహిళలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top