Alexa
YSR
‘ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటా’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

వాళ్లు అవినీతి ఆరాధకులు

Sakshi | Updated: January 09, 2017 01:15 (IST)
వాళ్లు అవినీతి ఆరాధకులు ప్రవాసీ దివస్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

నోట్ల రద్దు విమర్శకులపై ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రధాని ధ్వజం
అవినీతి, నల్లధనంపై యుద్ధం చేస్తున్నాం
పెద్ద నోట్ల రద్దు సాహసోపేత నిర్ణయం
మద్దతిచ్చిన వారికి రుణపడతా
త్వరలో ‘ప్రవాసీ కౌశల్‌ వికాస యోజన’
భారతీయుడినని గర్వపడతా: పోర్చుగల్‌ ప్రధాని


సాక్షి, బెంగళూరు
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. నోట్ల రద్దును ప్రజా వ్యతిరేక నిర్ణయం అంటున్న వారు అవినీతి, నల్లధనానికి ‘రాజకీయ ఆరాధకులు’ అంటూ మండిపడ్డారు. బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగే 14వ ప్రవాసీ భారతీయ దివస్‌ (పీబీడీ) కార్యక్రమంలో రెండో రోజైన ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. నల్లధనానికి రాజకీయ ఆరాధకులు కొంతమంది మా ప్రయత్నాలను ప్రజా వ్యతిరేకం అని విమర్శిస్తున్నారు’’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాలను, సమాజాన్ని, పరిపాలనను డొల్ల చేస్తున్న అవినీతి, నల్లధనంపై తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తోందని మోదీ చెప్పారు.

ఈ యుద్ధానికి మద్దతు తెలుపుతున్న ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పెద్దనోట్ల’రద్దు నిర్ణయాన్ని దేశంలోని సామాన్య ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. అవినీతి నిర్మూలనకు సాహసోపేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ వెంటే ఉన్న దేశ ప్రజలందరికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఎవరేమన్నా తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు. నోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలుస్తుందని తెలిపారు. స్వచ్ఛభారత్, స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా ద్వారా భారత్‌లోని ప్రతి ఒక్కరి అభివృద్ధితో భుజం కలిపే ఎన్‌ఆర్‌ఐలకు తమ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని మోదీ చెప్పారు.

ప్రవాసుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం..
ప్రవాస భారతీయుల రక్షణ, సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని మోదీ చెప్పారు. తాము పాస్‌పోర్టు రంగును చూడబోమని, రక్తసంబంధాన్ని మాత్రమే చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మేధో వలసను (బ్రెయిన్‌ డ్రైన్‌) తగ్గించి, మేధోపయోగాన్ని (బ్రెయిన్‌ గెయిన్‌) పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ‘‘విదేశాల్లో మూడు కోట్ల మంది భారతీయులు ఉన్నారు. వీరి ద్వారా ప్రతి ఏటా 69 బిలియన్‌ డాలర్లు వివిధ రూపాల్లో భారత్‌కు వస్తున్నాయి. అభివృద్ధిలో వారి సహకారం ఎనలేనిది. ప్రవాసులకు అవసరమైన వసతి, పాస్‌పోర్టు వ్యవహారాల్లో న్యాయసహాయంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించాల్సిందిగా విదేశాల్లోని భారత ఎంబసీలకు సూచించాం. న్యాయపరంగా 24 గంటల్లో సహాయం అందించేందుకు ముందుంటాం.

సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రవాస భారతీయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆ శాఖ మంత్రి సుష్మాజీ ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నా ఉద్దేశంలో ఎఫ్‌డీఐకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఫారిన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అయితే.. రెండోది ఫస్ట్‌ డెవలప్‌ ఇండియా. దీని వల్ల పెట్టుబడులు ఎంత ముఖ్యమో అందరూ అర్థం చేసుకోవాలి. భారత్‌లో పెట్టుబడులు పెట్టదలచిన ఎన్‌ఆర్‌ఐల కోసం ఎఫ్‌డీఐ నిబంధనలను పూర్తిగా సరళీకరించాం’అని మోదీ తెలిపారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు రప్పించి మోసం చేసే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా త్వరలో నూతన చట్టాలు రూపొందించనున్నామని వెల్లడించారు.

ఓసీఐ ప్రక్రియ ప్రారంభమైంది..
ఫిజితో పాటు వివిధ దేశాలకు ఒప్పంద కూలీలుగా వెళ్లిన వారి వారసులు ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డులకు అర్హులని, దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని మోదీ తెలిపారు. పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (పీఐఓ) కార్డుతో ఫిజి, రీయూనియన్‌ ఐలాండ్స్, సూరినామ్, గయానాతో పాటు ఇతర కరేబియన్‌ దీవుల్లో ఉన్న ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అలాగే పీఐవో కార్డులను ఓసీఐ కార్డులుగా మార్చుకోవడానికి అపరాధ రుసుం లేకుండా జూన్‌ 30 వరకూ గడువు ఉందని, దీని కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని మోదీ చెప్పారు. ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తున్నందుకు కర్ణాటక ప్రభుత్వానికి ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 20కిపైగా స్టార్టప్‌ల విజయాలపై కాఫీటేబుల్‌ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ స్వదేశానికి వచ్చిన రోజును ప్రవాసీ దివస్‌గా జరుపుకుంటున్నారు. దీనిని 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి 9 వరకూ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కార్యక్రమంలో పాల్గొనడానికి 6 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

భారతీయుడినని గర్వపడతా: పోర్చుగల్‌ ప్రధాని
ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రధాని మోదీతో పాటు పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియా కోస్టా కూడా పాల్గొన్నారు. ఆంటోనియో పూర్వీకులు గోవాకు చెందినవారు. ఎప్పుడైనా భారత్‌కు వస్తే గోవా వెళ్లి తన బంధువులను కలుస్తానని ఆయన తెలిపారు. భారతీయుడినని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతానన్నారు. పోర్చుగల్, భారత్‌ మధ్య వివిధ రంగాల్లో వందల ఏళ్ల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. వాటిని మరింత మెరుగు పరుచుకోవడానికి ఇరుదేశాలు కృషిచేయాలని ఆంటోనియా కోస్టా అభిలషించారు.

విదేశాలకు వెళ్లే వారికోసం ప్రవాసీ కౌశల్‌ వికాస్‌ యోజన..
భారత్‌ నుంచి విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లే యువతలో నైపుణ్యం పెంచేందుకు త్వరలోనే ‘ప్రవాసీ కౌశల్‌ వికాస యోజన’అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా విదేశాలకు వెళ్లే యువతకు ఆయా దేశాల్లోని చట్టాలు, అక్కడి పని విధానం, భాష, సంస్కృతి సంప్రదాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో మొదటిసారిగా విదేశాలకు వెళ్లే యువతలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఆయా దేశాల్లోని పరిస్థితులకు తొందరగా అలవాటుపడగలరని చెప్పారు.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

మిరప మంటలెందుకు?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC