మార్గదర్శకం కావాలి

మార్గదర్శకం కావాలి - Sakshi


నీతి ఆయోగ్‌కు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో సమూల మార్పులు తెచ్చేలా వచ్చే 15 ఏళ్ల కోసం దేశాభివృద్ధికి దార్శనిక పత్రం రూపొందించాలని నీతి ఆయోగ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. స్వల్ప మార్పులకు కాలం ఎప్పుడో చెల్లిపోయిందంటూ.. 21వ శతాబ్దంలో దేశ అభివృద్ధికి పునాది వేయటానికి మార్గదర్శక ప్రణాళిక కావాలన్నారు. ఆయన గురువారం నీతి ఆయోగ్ సభ్యులను కలసి ముచ్చటించారు. ‘‘సమూల మార్పు తక్షణావసరం. గత మూడు దశాబ్దాల్లో సాంకేతికత అనేది మార్పుకు చోదకశక్తిగా ఆవిర్భవించింది. ఈ మార్పు వేగం ఆగదు.



ప్రజల జీవితాలను మెరుగుపరచటానికి సమూల మార్పును అందించే సాహసం, సామర్థ్యం ప్రభుత్వానికి ఉన్నాయి’’ అని అన్నారు. భారత సహజ, మానవ వనరులను తెలివిగా వినియోగించుకోవటం ఈ మార్పుకు కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. ఖనిజ సంపద, అపారమైన సౌరశక్తి సామర్థ్యం, అంతంతమాత్రమే వినియోగించుకుంటున్న తీర ప్రాంతాలను ఉదాహరణలుగా చూపారు. వ్యవసాయరంగంలో.. కేవలం వ్యవసాయ ఉత్పాదకతను పెంచటంపైన మాత్రమే కాకుండా.. ఉజ్వల గ్రామీణ ఆర్థికవ్యవస్థ సమగ్ర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.



ఆహార శుద్ధి రంగం ప్రాధాన్యతను.. అందులో గిడ్డంగుల అభివృద్ధి, సాంకేతికత వినియోగం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. సుపరిపాలనకు సామర్థ్యాలను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ.. సమాచార వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాల్సిన ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ప్రయోగాలు చేసే వ్యక్తిని నేను. నాకు ఆత్మవిశ్వాసముంది’ అని ప్రధానిపేర్కొన్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top