భగవంతుడా.. బతికించు

భగవంతుడా.. బతికించు - Sakshi


సియాచిన్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన జవాను



♦ సోమవారం రాత్రి  హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలింపు

♦ అత్యంత విషమంగా వీర జవాను ఆరోగ్యం

♦ ఆసుపత్రికి వచ్చి చూసివెళ్లిన ప్రధాని

♦ మిగతా 9 మంది సైనికుల మృతి

♦ భగవంతుడా బతికించాలని ప్రార్థిస్తున్న భారతావని

 

 న్యూఢిల్లీ/ధార్వాడ్: అతనో వీర జవాను... హిమాలయ పర్వతశ్రేణుల్లో అత్యంత కఠిన వాతావరణంలో సియాచిన్‌పై 19 వేల అడుగుల ఎత్తులో... ఎడతెగకుండా కురిసే మంచులో సరిహద్దు భద్రతను నిర్వర్తిస్తున్నాడు. ఈనెల మూడోతేదీన ప్రకృతి కన్నెర్ర చేసింది. సియాచిన్‌లోని భారత సైనికుల బేస్‌పై భారీ మంచుచరియలు విరిగిపడ్డాయి. ఆచూకీ దొరకని పదిమంది సైనికులూ మరణించే ఉంటారని రెండు రోజులకే ఆర్మీ అధికారికంగా ప్రకటించింది కూడా. మృతదేహాలను వెలికితీసే చర్యలు కొనసాగాయి. సోమవారం... అప్పటికే ఐదురోజులు గడిచిపోయాయి. సోమవారం సాయంత్రానికి ఐదు మృతదేహాలను బయటకు తీశారు.



గాలింపులో భాగంగా మంచుకొండలను తవ్వుతున్న సిబ్బందికి మరొక దేహం కనిపించింది. మెల్లిగా చుట్టూ ఉన్న మంచును తొలగిస్తున్నారు. ఆశ్చర్యం.. ఆ సాహస జవాను చనిపోలేదు. సర్వశక్తులతో మృత్యువుతో పోరాడుతున్నాడు.  అంతే సహాయక సిబ్బందిలో ఒక్కసారిగా విభ్రాంతి. ఏమిటిది? ఎలా సాధ్యం? వెంటనే అక్కడే ఉన్న వైద్యబృందం చికిత్స మొదలుపెట్టింది. అనంతరం ఢిల్లీలోని ఆర్మీ  రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, 25 అడుగుల లోతులో మంచుకింద కూరుకుపోయినా... ఐదు రోజుల దాకా ఊపిరి నిలుపుకోవడం అద్భుతమే. 



అసలు శ్వాస అందడమే గగనం. మంచులోతుల్లో సజీవ సమాధి.. ఎక్కడున్నామో, ఎలా బయటపడతామో, సహాయం ఎప్పుడు అందుతుందో, అసలు బతుకుతానో... లేదో! ఇవేవీ ఆ వీర జవాను స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. అతను లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్. అత్యంత శీతల వాతావరణంలో రోజుల తరబడి ఉండటంతో అతని రక్తపోటు తగ్గింది. గుండె కొట్టుకునే వేగం నెమ్మదించింది. శరీరంలోని కీలక అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. శరీర ఉష్ణోగ్రతా నెమ్మదిగా తగ్గింది. అయితే అదృష్టవశాత్తు హనుమంతప్ప శరీరం ఎక్కడా మంచుకు ఎక్స్‌పోజ్ కాలేదు. పూర్తిగా కవర్ చేసి ఉండటంతో కాళ్లు, చేతులు గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉత్పన్నం కాలేదు. అయితే శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం, ఆహారం లేకపోవడంతో... బాగా నీరసించిపోయాడు. హనుమంతప్ప కాలేయం, కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదని, దీంతో వెంటలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. దేశ రక్షణకోసం సియాచిన్‌పై విధుల్లో నిలిచిన ఈ వీరజవానును బతికించాలని  భారతావని భగవంతుడిని ప్రార్థిస్తోంది.



 ఐదు రోజుల పాటు.. మైనస్ 40 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత వద్ద.. మంచు కింద 30 అడుగుల లోతున కూరుకుపోయినా.. హనుమంతప్ప   జీవించి ఉండటం సంచలనంగా మారింది. ఆయనను మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. హనమంతప్ప ఇంకా స్పృహలోకి రాలేదని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. హనుమంతప్పను ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ పరామర్శించారు. హనుమంతప్ప  కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందినవారు. ఆయనకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. ఆయన జీవించి ఉండడంతో వారి కుటుంబంలో తిరిగి సంతోషం నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సియాచిన్ గ్లేసియర్‌పై ఉన్న సైనిక బేస్‌క్యాంపుపై ఆరు రోజుల కింద(ఫిబ్రవరి 3) మంచు చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. 19 వేల అడుగుల ఎత్తయిన ఆ ప్రాంతంలో మంచు చరియల కింద పది మంది జవాన్లు కూరుకుపోయారు.  



 యుద్ధ ప్రాతిపదికన సహాయం..

 సియాచిన్ ప్రాంతంలో హనమంతప్ప జీవించి ఉన్నట్లు గుర్తించిన సైన్యం వైద్యులు.. అక్కడే చికిత్స ప్రారంభించారు. పూర్తిగా చల్లబడిపోయిన శరీర భాగాలను వేడెక్కించేందుకు వేడి ద్రవాలను నరాల ద్వారా ఎక్కించారు. ఓవైపు వేడి చేసిన ఆక్సిజన్ వాయువును అందిస్తూ.. మరోవైపు శరీరాన్ని బయటి నుంచి కూడా వేడి చేసే చర్యలు చేపట్టారు. ఆ వెంటనే ప్రమాద స్థలి నుంచి ఓ హెలికాప్టర్‌లో సియాచిన్ బేస్‌క్యాంపునకు చేర్చారు. అక్కడ మరికొంత చికిత్స చేసి.. వైద్య నిపుణులు తోడుగా మరో హెలికాప్టర్‌లో  థాయిస్ ఎయిర్‌బేస్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్య సౌకర్యాలున్న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.



 ఆయన ఆత్మస్థైర్యం గొప్పది: మోదీ

 మంచు చరియల కింద నుంచి సజీవంగా బయటపడిన హనమంతప్పను మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ పరామర్శించారు. హనమంతప్ప ఒక గొప్ప సైనికుడని, ఆయన ఆత్మస్థైర్యం ఎంతో గొప్పదని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.



 రాష్ట్రపతి అభినందన: హనుమంతప్ప సాహస వీరుడని, సియాచిన్ మంచు చరియల తుపాను నుంచి ఆయన చిరంజీవిగా బయటపడిన వార్త విని తనకు ఎంతో ఆనందమేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.



 ఇది మాకు పునర్జన్మ.. హనమంతప్ప  భార్య మహాదేవి: సియాచిన్‌లో మంచు కింద కూరుకుపోవడంతో హనుమంతప్ప   మరణించి ఉంటాడన్న ఆవేదనలో కూరుకుపోయిన ఆయన కుటుంబంలో... ఆయన బతికే ఉన్నాడన్న వార్త తిరిగి సంతోషం నింపింది. ఇది తమ కుటుంబానికే పునర్జన్మ అని ఆయన భార్య మహాదేవి పేర్కొన్నారు.



 బుల్లెట్ల కంటే మంచే ప్రమాదకరం

 హిమాలయాల్లో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే యుద్ధభూమి సియాచిన్.  పగలు ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌లు.. రాత్రి మైనస్ 55 డిగ్రీల వరకూ పడిపోతుంది. 1984 నుంచి వాతావరణ ప్రతికూలతల వల్ల 869మంది చనిపోయారు. 1984లో పాక్ నుంచి సియాచిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్‌లో 33మంది సైనిక అధికారులు చనిపోయారు. వీరు కాకుండా 54మంది జూనియర్ కమాండింగ్ అధికారులు, మరో 782మంది ఇతర అధికారులు, జవానులు మృతి చెందారు.

 

 మిగతా తొమ్మిది మంది మృతి

 హనుమంతప్ప మినహా మంచులో కూరుకుపోయిన మిగతా తొమ్మిదిమంది జవానులు మరణించినట్లు ఆర్మీ ప్రకటించింది.

► సిపాయ్ ముష్తాక్ అహ్మద్.. పర్నపల్లె, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

► సుబేదార్ నగేషా.. తేజూర్, హసన్ జిల్లా కర్ణాటక

► లాన్స్ హవాల్దార్ ఎలుమామలై.. దుక్కం పరై, వేలూరు,తమిళనాడు

► లాన్స్ హవిల్దార్ ఎస్ కుమార్.. కుమానన్ తోఝు, తెని.. కేరళ

► లాన్స్‌నాయక్ సుధీశ్ మోన్రోతురుత్, కొల్లాం, కేరళ

► సిపాయ్ మహేశ పీఎన్ హెచ్‌డీ కోటే, మైసూర్, కర్ణాటక

► సిపాయ్ గణేశన్, చెక్కతేవన్ పట్టి, మదురై, తమిళనాడు

► సిపాయ్ రామమూర్తి, గుడిసతన పల్లి, కృష్ణగిరి, తమిళనాడు

►సిపాయ్ నర్సింగ్ అసిస్టెంట్ సూర్యవంశి, మస్కర్‌వాడి, సతారా, మహారాష్ట్ర

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top