ప్లీజ్.. సహకరించండి!

ప్లీజ్.. సహకరించండి! - Sakshi


ఖాండ్వా: భూసేకరణ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.  బిల్లులో రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్నైనా తొలగించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదానికి సహకరించాలని రాజ్యసభలోని విపక్ష సభ్యులను అభ్యర్థించారు. 'రాజ్యసభలో మాకు మెజారిటీ లేదనేది వాస్తవం. మీ(విపక్షం) మద్దతు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగించలేం. మెజారిటీ ఉంది కదా అని అభివృద్ధిని అడ్డుకోవద్దని మిమ్మల్ని బహిరంగంగా అభ్యర్థిస్తున్నా' అన్నారు.



'నేను రైతు వ్యతిరేకిని కాదని రాజ్యసభలోని అన్ని పార్టీలకు చెప్పాను. బిల్లులో రైతు వ్యతిరేక ప్రతిపాదనలేమైనా ఉంటే చెప్పమన్నాను. వాటిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాను. కానీ వారు ఏమీ చెప్పలేదు. ఈ ప్రభుత్వం పనిచేయడం, దేశం అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు' అని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో శ్రీ సింగాజీ థర్మల్ విద్యుత్కేంద్రంలోని ఒక్కొక్కటి 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్లను గురువారం ప్రధాని జాతికి అంకితమిచ్చారు. అలాగే, ఆ ప్రాజెక్టు రెండోదశలో భాగంగా ఒక్కోటి 660 మెగావాట్ల సామర్థ్యం గల మరో రెండు విద్యుత్కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు, ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.



మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..


  • నేను రైతు వ్యతిరేకిని కాదు. మేమెప్పటికీ రైతులను వ్యతిరేకించబోం.

  • పాఠశాలలకు, ఆసుపత్రులకు, జలవనరుల ప్రాజెక్టులకు, రహదారుల నిర్మాణానికి, గృహ నిర్మాణానికి.. భూమిని సేకరించే ప్రతిపాదన గత ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టంలో లేదు.

  • మేం వాటిని తాజా బిల్లులో పొందుపర్చాం. మీరు చెప్పండి.. ఆ సౌకర్యాలు మీకు అక్కర్లేదా?

  • అన్ని వర్గాల సంక్షేమానికి అవసరమైన చర్యలను బడ్జెట్లో పొందుపర్చాం.

  • మొత్తం 204 బ్లాకులకు గానూ కేవలం 19 బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం ద్వారా రూ. 1.1 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.

  • మా విధానాల వల్ల బొగ్గు గనులున్న రాష్ట్రాలు కూడా అధిక లాభాలు ఆర్జిస్తాయి.

  • 4 బ్లాకుల ద్వారా మధ్యప్రదేశ్ రూ. 40 వేల కోట్ల ఆదాయం పొందుతోంది.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top