'షిర్డిసాయి' రక్షణ కోసం సుప్రీం కోర్టుకు!

'షిర్డిసాయి' రక్షణ కోసం సుప్రీం కోర్టుకు! - Sakshi


ఢిల్లీ: షిర్డిసాయి విగ్రహాల రక్షణ కోసం సాయిధామ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాయిధామ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ మహారాష్ట్రలోని అన్ని దేవాలయాలతోసహా సాయి ఆలయ వ్యవహారాలు చూస్తోంది. షిర్డిసాయికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలంటూ  ఈ ట్రస్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో  ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసింది.  ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలను ట్రస్ట్‌ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. దేశంలో ఏ దేవాలయంలో కూడా షిర్డి సాయి విగ్రహాలు తొలగించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ట్రస్ట్ కోరింది.



స్వరూపానంద సరస్వతి ఏమన్నారు?



షిర్డీ సాయిబాబా దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దని స్వరూపనంద సరస్వతి  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి బాబాకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయన్నారు. అల్లాను కొలుస్తూ మాంసం తినే సాయి బాబా హిందూ దేవుడు ఎలా అవుతారని స్వరూపానంద సరస్వతి అన్నారు. సాయి భక్తులు  సనాతన దేవుళ్ల బొమ్మలతో సొమ్ము చేసుకున్నారని విమర్శించారు.  వాళ్లు మన దేవుడి బొమ్మలు ఉపయోగించకపోతే వాళ్లకు ఎవరూ ఏమీ ఇవ్వరని చెప్పారు. ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని, అయితే సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని స్వరూపానంద పేర్కొన్నారు.

 

నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్ధతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top