ఆత్మహత్యలపై దద్దరిల్లిన పార్లమెంటు

ఆత్మహత్యలపై దద్దరిల్లిన పార్లమెంటు - Sakshi


అన్నదాతలకు సాయం అందలేదన్న విపక్షాలు

సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించారని ధ్వజం



న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలు, ఉపాధి హామీ పథకం, నోట్ల రద్దు తదితర అంశాలపై పార్లమెంటు ఉభయ సభలు సోమవారం విపక్ష, అధికార పక్షాల వాగ్యుద్ధంతో దద్దరిల్లాయి. పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల నిధులకు ప్రభుత్వంకోత పెట్టిందని విపక్షాలు మండిపడ్డాయి. నోట్ల రద్దుతో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశాయి. గ్రామీణ ఉపాధి హామీకి పెంచిన రూ. వెయ్యి కోట్ల నిధులు ఏ మూలకూ సరిపోవని లోక్‌సభలో కాంగ్రెస్‌ ఆరోపించింది. నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై జరిగిన చర్చలో కేసీ వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌) మాట్లాడుతూ.. ఉపాధి పథకాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ దానికి కేవలం ఒక శాతం నిధులే పెంచారన్నారు.



సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమిళనాడులో చనిపోయిన రైతుల పుర్రెలతో జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు తెలుపుతున్నారని వెల్లడించారు. గోవాలో బీజేపీకి తగినంత బలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనైతికమని మండిపడ్డారు. పుర్రెల వార్త అబద్ధమని అన్నాడీఎంకే పేర్కొనగా.. కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే జోక్యం చేసుకుని, దేశవ్యాప్తంగా రైతులు కష్టాలుపడుతున్నారన్నారు. స్థూల దేశీయోత్పత్తి రేటును నోట్ల రద్దు దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యుడు కిరీట్‌ సోమయ్య కల్పించుకుంటూ.. నోట్ల రద్దును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ యూపీలో విలువ కోల్పోయిందన్నారు. దేశం నాశనం కావడం లేదని, మోదీకి అడ్డుపడుతున్న వాళ్లే నాశనం అవుతున్నారన్నారు.



రాజ్యసభలో..

రైతు రుణాలను రద్దుచేస్తామన్న బీజేపీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకపోవడంతో ఒక్క మహారాష్ట్రలోనే 117 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాజ్యసభలో కాంగ్రెస్‌ ఆరోపించింది. జీరో అవర్‌లో ప్రమోద్‌తివారీ ఈ అంశాన్ని లేవనెత్తారు. కరువు పరిస్థితుల వల్ల రైతులు చనిపోవడం లేదని, పంటకు గిట్టుబాటు ధరలేక చనిపోతున్నారని అన్నారు. నోట్ల రద్దుకుS ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని, ఆర్థిక వ్యవస్థలో 33.7 శాతంగా ఉన్న బ్లాక్‌ మార్కెట్‌కు భారీ దెబ్బ తగిలిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్‌ చెప్పారు. డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా ప్రాజెక్టులతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.



చార్జీలను ఉపసంహరించాలి: ఠాకూర్‌

వినియోగదారుల లావాదేవీలపై చార్జీలు విధించాలన్న బ్యాంకుల ప్రతిపాదనను, క్రెడిట్‌ కార్డులపై 3% పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో సీపీఎం తదితర విపక్షాలు కూడా ఇదే డిమాండ్‌చేశాయి.  



మంత్రుల గైర్హాజరుపై అన్సారీ అసంతృప్తి

రాజ్యసభలో ప్రశోత్తరాల సమయంలో జవాబులు చెప్పాల్సిన విద్యుత్, పర్యావరణ, నౌకాయాన శాఖల మంత్రులు లేకపోవడంపై చైర్మన్‌ అన్సారీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top