భారత్‌లోకి చొరబడి కాల్పులు

భారత్‌లోకి చొరబడి కాల్పులు


సరిహద్దులో పాకిస్తాన్‌ కిరాతకం

► ఇద్దరు జవాన్ల మృతి

► ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీల హతం




జమ్మూ: పాకిస్తాన్‌ ఆర్మీ గురువారం మరోసారి సరిహద్దులో రెచ్చిపోయింది. ఏకంగా నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ని దాటి వచ్చి భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. ఎల్‌ఓసీని దాటి 600 మీటర్లు భారత భూభాగంలోకి చొరబడిన బీఏటీ (బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌) దళాలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి. బీఏటీకి మద్దతుగా పాక్‌ ఆర్మీ పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బీఏటీ సభ్యులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.


పాకిస్తాన్‌ ఆర్మీ సిబ్బంది, ఉగ్రవాదులను కలగలిపి భారత జవాన్లపై దాడులు చేయడానికి ఏర్పరచిన బృందమే బీఏటీ. గురువారం దాడి చేసిన బీఏటీలో ఐదు నుంచి ఏడు మంది సభ్యులు ఉన్నారనీ, భారత శిబిరాలకు దాదాపు 200 మీటర్ల దూరం వరకు వారు వచ్చారని ఓ ఆర్మీ అధికారి చెప్పారు. భారత జవాన్లు ప్రతికాల్పులు జరపగా ఇద్దరు మరణించారు. మిగిలినవారు తప్పించుకుని వెనక్కు వెళ్లిపోయారు. భారత గస్తీ బృందాలపై దాడులు చేయడానికే వారు సరిహద్దును దాటి వచ్చారని అధికారి చెప్పారు.


మధ్యాహ్నం 3.30 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. కాగా, చనిపోయిన ఇద్దరు జవాన్లు మహారాష్ట్రకు చెందిన వారే. ఒకరు ఔరంగాబాద్‌కు చెందిన నాయక్‌ జాదవ్‌ సందీప్‌ (34) కాగా, మరొకరు కొల్హాపూర్‌కు చెందిన సిపాయి మనే సావన్‌ బల్కు (24). జాదవ్‌కు భార్య ఉండగా, సావన్‌ అవివాహితుడు. ఈ ఏడాది పూంచ్‌లో బీఏటీ దాడి చేయడం ఇది మూడోసారి. మే 1న పూంచ్‌లోని కృష్ణ ఘాటీలో బీఏటీ ఇద్దరు జవాన్ల తలలు నరికింది. ఫిబ్రవరి 18న ఓసారి బీఏటీ దాడి చేసింది. గతంలోనూ బీఏటీ పలు దాడులు చేసి జవాన్ల తలలు నరకడం, వారి శరీరాలను ముక్కలు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top