మాట నిలబెట్టుకుందాం..

మాట నిలబెట్టుకుందాం.. - Sakshi


ఉగ్రవాదాన్ని కట్టడి చేద్దాం.. సార్క్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు



166 మందిని బలిగొన్న ముంబై మారణహోమాన్ని మర్చిపోలేం

సమష్టి పోరుతోనే శాంతియుత దక్షిణాసియా సాకారమవుతుంది

దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉందని వ్యాఖ్య

సార్క్ 18వ సమావేశాలు ప్రారంభం..


 

కఠ్మాండు: ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని, సీమాంతర నేరాలను కట్టడి చేస్తామని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనేందుకు కృషి చేయాలని సార్క్ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ భద్రత, ప్రజల జీవితాలకు సంబంధించి అవగాహన, సున్నితంగా స్పందించేతత్వం ఉంటే దేశాల మధ్య స్నేహం, సహకారం పెంపొందుతాయని... ఇది అంతిమంగా శాంతికి, సుస్థిరతకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో బుధవారం సార్క్ 18వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల తొలిరోజున ప్రధాని మోదీ దాదాపు దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఇందులో ప్రధానంగా ఉగ్రవాద అంశంతో పాటు సార్క్ దేశాల మధ్య సహకారం, వీసాల సరళీకరణ, వాణిజ్యం తదితర అంశాలపై ప్రసంగించారు. 2008లో ముంబైలో 166 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడి జరిగి బుధవారం నాటికి ఆరేళ్లయిన సందర్భంగా మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ఆ భయంకర మారణ హోమాన్ని భారత ప్రజలు మరిచిపోలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలకు పాల్పడడాన్ని నిర్మూలిస్తామని చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి సార్క్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచి ఇరుగుపొరుగు ఉండాలనే అన్ని దేశాల కోరిక అని... భద్రత, ప్రజల జీవితాలకు సంబంధించి స్పందించేతత్వం ఉంటే దేశాల మధ్య స్నేహం, సహకారం పెంపొందుతాయని మోదీ పేర్కొన్నారు. సమీకృత దృష్టితో, ఉమ్మడి చర్యలతో అందరూ కృషి చేస్తే.. శాంతియుత, సౌభాగ్యమైన దక్షిణాసియా సాకారమవుతుందన్నారు.



ఐదేళ్ల వాణిజ్య వీసా..: సార్క్ దేశాలతో వాణిజ్యం, వ్యాపార సంబంధాలు పెంపొందడం కోసం వారికి మూడు నుంచి ఐదేళ్ల బిజినెస్ వీసా అందజేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దీనిని ‘సార్క్ బిజినెస్ ట్రావెలర్ కార్డు’ ద్వారా మరింత సులభం చేయవచ్చని ఆయన ప్రతిపాదించారు. సార్క్ దేశాల మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో... ఈ దేశాల మధ్య జరుగుతున్నది కేవలం 5 శాతమేనని, దీనిని పెంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాల్లో మౌలిక వసతుల కొరత పెద్ద సమస్య అని.. అందువల్ల భారత్‌లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యం, ఘనమైన వారసత్వం ఉన్న ప్రాంతం దక్షిణాసియా. అభివృద్ధి సాధించాలనే తపన, యువత మన బలం. ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.. ’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణాసియా ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వైద్యం కోసం భారత్ వచ్చేవారికి.. వెంటనే వీసా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. కాగా, మోదీ బుధవారం అఫ్ఘానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారి మధ్య వాణిజ్యపరమైన అంశాలు, రక్షణ సహకారంపై చర్చలు జరిగాయి. అఫ్ఘాన్‌తో సంబంధాలు పరిపుష్టం చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి మోదీ హామీఇచ్చారు.

 

‘సార్క్’ ఒప్పందాలకు పాక్ చెక్

 

సార్క్ దేశాల అనుసంధానతకు సంబంధించిన ఒప్పందాలను బుధవారం పాకిస్తాన్ అడ్డుకుంది. ఆ ఒప్పందాల అమలుకు దేశీయంగా తాము సిద్ధంగా లేమని పేర్కొంటూ వాటిపై సంతకాలు చేసేందుకు నిరాకరించింది. సార్క్ దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత పెరగడం, సభ్య దేశాల మధ్య వస్తు రవాణా సులభతరం కావడం.. మొదలైనవి లక్ష్యాలుగా రూపొందించిన ఆ ఒప్పందాలను పాక్ అడ్డుకోవడంపై భారత్, శ్రీ లంకలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, పాక్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారం.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top