మదింపు జరగాల్సిందే

మదింపు జరగాల్సిందే - Sakshi


 ‘పద్మనాభ స్వామి’ ఆదాయ వ్యయాలపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

 

 న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయ సంపద, పాలనా పరమైన అంశాలపై సుప్రీం కోర్టు గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ సంపద సహా ఆదాయ వ్యయాలపై మదింపు తప్పనిసరన్న కోర్టు.. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ నేతృత్వంలో ఆడిటింగ్ జరిపించాలని ఆదేశించింది. దీనికిగాను ప్రత్యేక ఆడిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.

అదేవిధంగా ఆలయానికి ఇప్పటి వరకు ఉన్న పాలక మండలిని రద్దు చేస్తూ జిల్లా జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ కుమార్‌ను ఆలయ ఎగ్జిక్యూటివ్(ఈవో) అధికారిగా నియమించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ ఎ.కె.పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.



1.ఆలయంలో జరుగుతున్న అవకతవకలు, పాలనా పరమైన లోపాలపై సీనియర్ అడ్వొకేట్ గోపాల సుబ్రమణియం సమర్పించిన నివేదికపై రెండో రోజు గురువారం కూడా సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

2. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్వామికి చెందిన సంపదను పరాధీనం చేయడం, అమ్మడం వంటివి చేయరాదని ప్రతి వస్తువునూ భద్రపరచాలని ఆదేశించింది.

3. తిరువనంతపురం జిల్లా జడ్జి హిందూ వర్గానికి చెంది ఉండని పక్షంలో హిందూ వర్గానికి చెందిన తదుపరి సీనియర్ జడ్జి చైర్మన్‌గా నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాలంది.

4. సుప్రీం ఆదేశాలను శిరసావహిస్తామని కేరళ సీఎంఊమెన్ చాందీ చెప్పారు. అయితే, ట్రావెన్‌కోర్ రాజకుటుంబాన్ని అవమాన పరిచే ధోరణిని తాము సహించబోమన్నారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top