అద్వానీకి పద్మ విభూషణ్

అద్వానీకి పద్మ విభూషణ్

  • అమితాబ్‌తోపాటు మరో 9 మందికీ..

  •  నలుగురు తెలుగువారికి పద్మశ్రీ

  •  ప్రవాసాంధ్రులు డాక్టర్ నోరి, రఘురామ్‌లకు కూడా..  

  • న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతమైన ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.  నలుగురు తెలుగువారిని, ఇద్దరు ప్రవాసాంధ్రులనూ పద్మ శ్రీ వరించింది. మొత్తంగా.. 9 మందికి పద్మ విభూషణ్ , 20 మందికి పద్మ భూషణ్, 75 మందికి పద్మ శ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. పద్మ విభూషణ్ అవార్డు వరించినవారిలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, తదితరులు ఉన్నారు.

     

    నలుగురు తెలుగువారికి ‘పద్మ’ అవార్డులు




    పద్మ అవార్డుల్లో ఈసారి నలుగురు తెలుగువారికి పద్మ శ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి క్రీడారంగంలో మిథాలీ రాజ్(క్రికెట్), పీవీ సింధు(బ్యాడ్మింటన్), వైద్యరంగంలో డాక్టర్ మంజుల అణగాని, ఏపీ నుంచి కళలు విభాగంలో కోట శ్రీనివాసరావు(సినిమా) ఎంపికయ్యారు. ప్రవాసాంధ్రులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురామ్ పిళ్లరిశెట్టిలకు పద్మ శ్రీ అవార్డు లభించింది. తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురు కూడా యువతులే. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలకు  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

     

    పద్మ విభూషణ్

     

    ఎల్‌కే అద్వానీ  -    రాజకీయాలు    

    అమితాబ్ బచ్చన్    - కళలు

    ప్రకాశ్ సింగ్ బాదల్ -    రాజకీయాలు

    డాక్టర్ డి వీరేంద్ర హెగ్డె    - సామాజిక  సేవ

    దిలీప్ కుమార్ -     కళలు

    స్వామి రామభద్రాచార్య    - ఆధ్యాత్మికం     

    ప్రొఫెసర్ రామస్వామి శ్రీనివాసన్ -     సైన్స్

    కొట్టాయన్ వేణుగోపాల్ -     రాజకీయాలు    

    అల్ హుస్సేనీ అగా ఖాన్ -    వాణిజ్యం

     

    పద్మ భూషణ్ వీరికే..

    జానూ బారువ    (కళలు-అసోం), విజయ్ భట్కర్-సైన్స్, మహారాష్ట్ర), స్వపణ్ దాస్ గుప్తా-సాహిత్యం ఢిల్లీ), స్వామీ సత్యామిత్రానంద్ గిరి, ఎన్ గోపాలస్వామి, డాక్టర్ సుభాష్ సి కశ్యప్, డాక్టర్ గోకులోత్సవ్‌జీ మహారాజ్, డాక్టర్ అంబరీష్ మిట్టల్, శ్రీమతి సుధా రఘునాథన్, హరీష్ సాల్వే, డాక్టర్ అశోక్ సేథ్, రజత్ శర్మ, సత్‌పాల్,శివకుమార స్వామి, డాక్టర్ ఖరగ్‌సింగ్ వాల్దియా,ప్రొఫెసర్ మంజుల్ భార్గవ,డేవిడ్ ఫ్రావ్లే, బిల్‌గేట్స్, మిలిందా గేట్స్, సాయిచిరో మిసుమి

     

    పద్మశ్రీలు వీరికే..

    డాక్టర్ మంజుల అనగాని,వైద్యం(తెలంగాణ), పీవీ సింధు, మిథాలీ రాజ్ (క్రీడలు, తెలంగాణ); అశోక్ భగత్, సంజయ్‌లీలా బన్సాలీ,  కోట నివాసరావు(ఆంధ్రప్రదేశ్); డాక్టర్ దత్తాత్రేయుడు నోరీ డాక్టర్, రఘురామ పిల్లరిశెట్టి, లతోపాటు మొత్తం 75 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.

     

    ప్రొఫైల్స్..



    ఎల్‌కే అద్వానీ: పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. వయస్సు 87. నవంబరు 8, 1927న కరాచీ(పాకిస్తాన్)లో కృష్ణచంద్ అద్వానీ, జ్ఞానీ దేవీలకు జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. జర్నలిస్టుగా పనిచేశారు. 1942లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1990లో రామజన్మభూమి కోసం రథయాత్రతో బీజేపీ ఒక్కసారిగా జాతీయ పార్టీగా అవతరించేలా చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా, 2002-04 మధ్యలో ఉపప్రధానిగా ఉన్నారు. 2014లో ఏడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

     

    అమితాబ్ బచ్చన్: పూర్తిపేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్. వయస్సు 72. అక్టోబరు 11, 1942న అలహాబాద్‌లో హరివంశ్ రాయ్, తేజీ బచ్చన్‌లకు జన్మించారు. 1969లో సాత్ హిందుస్థానీ సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. 1970లలో దీవార్, జంజీర్ వంటి సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకుని బాలీవుడ్ మెగాస్టార్‌గా ఎదిగారు. ఇంతకుముందు పద్మ శ్రీ(1984), పద్మ భూషణ్ (2001) అవార్డులు స్వీకరించారు.

     

    దిలీప్ కుమార్: అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. వయస్సు 92 ఏళ్లు. డిసెంబరు 11, 1922న పెషావర్(ప్రస్తుతం పాకిస్తాన్)లో జన్మించారు. తండ్రి లాలా గులామ్ సర్వార్ భూస్వామి, పండ్ల వ్యాపారి. 1944లో జ్వార్ భట సినిమాతో తెరంగేట్రం చేశారు. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా పేరుపొందారు. ఇంతకుముందు పద్మ భూషణ్(1991) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(1994)లు స్వీకరించారు.

     

    ప్రకాశ్ సింగ్ బాదల్: వయస్సు 87. డిసెంబరు 8, 1927న పంజాబ్‌లోని మలౌత్‌లో రఘురాజ్ సింగ్, సుంద్రీ కౌర్‌లకు జన్మించారు. 1947లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. సర్పంచి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1970లో పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2007లో నాలుగోసారి, 2012లో ఐదోసారి సీఎంగా పదవిని చేపట్టారు.

     

    డాక్టర్ నోరి దత్తాత్రేయుడు: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. అక్కడే విద్యనభ్యసించారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ చేశారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్‌గా ప్రపంచ ప్రసిద్ధులు. ప్రస్తుతం న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ ఆసుపత్రి/వెల్ కార్నెల్ మెడికల్ కళాశాలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఎట్ ది న్యూయార్క్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ ఆఫ్ క్వీన్స్ రేడియేషన్ అంకాలజీ యూనిట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  

     

    కోట శ్రీనివాసరావు: కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. బీఎస్సీ పూర్తిచేసి హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారు. తర్వాత నాటకాల కోసం ప్రమోషన్‌ని సైతం కాదనుకుని ఉద్యోగాన్నే వదులుకున్నారు. ‘ప్రాణం ఖరీదు’ నాటకం ఆయన సినీ జీవితానికి నాంది పలికింది. తాండ్ర పాపారాయుడు, ప్రతిఘటన, అహ నా పెళ్లంట సినిమాలతో సినీజీవితం మంచి మలుపు తిరిగింది. మూడున్నర దశాబ్దాల కాలంలో 700 చిత్రాల్లో నటించిన కోట ఆరు నంది అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.

     

    డాక్టర్ మంజుల అనగాని: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో 1968 నవంబర్ 8న జన్మించారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ చదివారు. 20 ఏళ్లలో 10 వేలకుపైగా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేశారు. అపోలో, కేర్, యశోద, బీమ్స్ ఆస్పత్రుల్లో పని చేశారు. ప్రస్తుతం మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో స్త్రీ, శిశు వైద్య విభాగం డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

     

    డాక్టర్ పి.రఘురామ్: గుంటూరులో పీవీ చలపతిరావు, ఉషాలక్ష్మి దంపతలుకు జన్మించారు. రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సల నిపుణుడిగా ప్రసిద్ధుడు. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో,  సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఇంగ్లాండ్‌లో ఎఫ్‌ఆర్‌సీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం కిమ్స్-ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్‌లో రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సల నిపుణుడిగా పని చేస్తున్నారు. భార్య  వైజయంతి, పిల్లలు సాయిరామ్, కృష్ణసాయి ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top