సర్కారుది నిరంకుశత్వం...

సర్కారుది నిరంకుశత్వం... - Sakshi


జేఎన్‌యూ విద్యార్థి నేత అరెస్ట్‌పై భగ్గుమన్న విపక్షాలు

♦ కన్హయ్య కుమార్ బేషరతు విడుదలకు డిమాండ్

♦ జేఎన్‌యూలో విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళన

♦ హాజరై మద్దతిచ్చిన రాహుల్‌గాంధీ

♦ మోదీ సర్కారును హిట్లర్‌తో పోలుస్తూ విమర్శలు

♦ రాజ్‌నాథ్‌ను కలిసిన ఏచూరి, డి.రాజా బృందం

♦ వర్సిటీ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణకు కేజ్రీవాల్ ఆదేశం

 

న్యూఢిల్లీ: ‘దేశద్రోహం’ కేసులో జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను అరెస్ట్ చేయటంపై ఢిల్లీలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, వామపక్షాలు సహా పలు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అరెస్ట్ చేసిన విద్యార్థి నేతను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీపీఎం నేత సీతారాం ఏచూరి హాజరయ్యారు.



మోదీ సర్కారును హిట్లర్‌తో పోలుస్తూ రాహుల్ తీవ్ర విమర్శలు సంధించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు సహించరానివంటూనే.. ఆ సాకుతో జేఎన్‌యూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి గళాన్ని అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. విద్యార్థి నేతను తక్షణమే విడుదల చేయాలని సీపీఎం, సీపీఐ, జేడీయూ నేతల బృందం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి డిమాండ్ చేసింది. ‘వీడియో దృశ్యాల్లో దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారిలో విద్యార్థులు ఉన్నారా?’ అని ఏచూరి ప్రశ్నించారు. దేశద్రోహం కేసులో నిందితులుగా పోలీసులు విడుదల చేసిన 20 మంది విద్యార్థుల జాబితాలో తన కుమార్తె పేరు కూడా ఉండటంపై సీపీఐ అగ్ర నేత డి.రాజా స్పందిస్తూ.. తమను దేశ వ్యతిరేకులుగా ఎవరు ఆరోపిస్తారని ప్రశ్నించారు.



ఏచూరి, రాజాల బృందం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కలిసి.. జేఎన్‌యూలో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సంబంధించి సాక్ష్యాల విశ్వసనీయతను నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. దీంతో.. విద్యార్థి నేత అరెస్ట్‌కు దారితీసిన ‘దేశ వ్యతిరేక నినాదాల’ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కేజ్రీవాల్ ఆదేశించారు. అదేసమయంలో.. మోదీ సర్కారు అందరినీ భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులను వినియోగించుకుంటోందని ఆరోపించారు.



మరోవైపు.. దేశ వ్యతిరేక శక్తులకు జేఎన్‌యూ కేంద్రం కాజాలదని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. జేఎన్‌యూ ఘటనకు సంబంధించి అమాయకులను ఇబ్బంది పెట్టబోమని.. దోషులను మాత్రం వదిలిపెట్టబోమని స్పష్టంచేసింది. రాహుల్‌గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు.. జేఎన్‌యూలో భారత వ్యతిరేక కార్యక్రమానికి మద్దతుగా ట్విటర్‌లో వ్యాఖ్యానించిన లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్‌సయీద్ స్వరంతో మాట్లాడుతున్నారని అధికార బీజేపీ ప్రతి దాడికి దిగింది. ఇదిలావుంటే.. తమ కుమారుడు దేశ వ్యతిరేకి కాదని, వామపక్ష పార్టీ సభ్యుడని, హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే అతడిని లక్ష్యంగా చేసుకుని కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని.. బిహార్‌లో ఒకప్పుడు ‘లెనిన్‌గ్రాడ్’గా పేరుపడ్డ బేగుసరాయ్ జిల్లా మాస్లాన్‌పూర్‌లో నివసిస్తున్న కన్హయ్య తల్లిదండ్రులు ఆరోపించారు.



పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా నిర్ధారితుడైన అఫ్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేయటాన్ని నిరసిస్తూ.. జేఎన్‌యూ ఆవరణలో గత మంగళవారం నాడు నిరసన కార్యక్రమం నిర్వహించటంపై వసంత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 124 ఎ (దేశద్రోహం), 120 బి (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం.. ఈ కేసులో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు, ఏఐఎస్‌ఎఫ్ నేత కన్హయ్యకుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేయటం తెలిసిందే. దీనిపై సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, జేడీ(యూ) అధికార ప్రతినిధి కె.సి.త్యాగిలు శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి.. విద్యార్థి నేతను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



కేజ్రీవాల్‌ను కలిసి స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు, ఢిల్లీ పీసీసీ చీఫ్ అజయ్‌మాకెన్, మాజీ కేంద్రమంత్రి ఆనంద్‌శర్మలు కూడా పాల్గొన్నారు. రాహుల్‌కు ఏబీవీపీ సభ్యులు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. జేఎన్‌యూ పూర్వవిద్యార్థులైన మాజీ సైనికోద్యోగులు కొందరు.. దేశ వ్యతిరేక కార్యాకలాపాల కేంద్రంగా మారిన వర్సిటీతో తాము సంబంధం కలిగివుండటం తమకు కష్టంగా ఉందని.. కాబట్టి తమ డిగ్రీలు తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు.



పోలీసులు వర్సిటీలో దాడి చేసేందుకు అనుమతించిన విధానాన్ని నిరసిస్తూ జేఎన్‌యూకే చెందిన నలుగురు డీన్‌లు వీసీ జగదీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. క్యాంపస్‌లోకి పోలీసులను అనుమతించటంపై విమర్శల నేపథ్యంలో.. వర్సిటీ ఆవరణ నుంచి పోలీసులను తొలగించటం జరిగిందని, విద్యార్థుల కదలికలపై ఎటువంటి ఆంక్షలూ లేవని పాలకవర్గం పేర్కొంది. బయటివారు వర్సిటీలోకి ప్రవేశించటంపై నిషేధం ఉందని చెప్పింది. వర్సిటీలో పరిస్థితులు, చర్యలపై స్థాయీ నివేదిక ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ వర్సిటీని కోరింది.ఈ పరిణామాల నేపథ్యంలో జేఎన్‌యూ చాన్స్‌లర్ కె.కస్తూరిరంగన్ శనివారం నాడు వర్సిటీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

 

 నా కుమార్తెను కాల్చి చంపుతామని కాల్స్ వచ్చాయి...

 ‘‘నా నిబద్ధత, నా కుమార్తె నిబద్ధతను ఎవరు ప్రశ్నించగలరు? మేము దేశ వ్యతిరేకులమని, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఎవరు ఆరోపించగలరు? వారికేమైనా పిచ్చా? వీడియో దృశ్యాల్లో నినాదాలు చేస్తున్న వారు ఎవరు? వాళ్లు జేఎన్‌యూ వాళ్లేనా? బయటి వాళ్లా? ఎవరికీ తెలియదు. ఏఐఎస్‌ఎఫ్ లేదా ఎస్‌ఎఫ్‌ఐ.. ఆ మాటకొస్తే వామపక్ష సంస్థలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఎవరూ ఆరోపించజాలరు. నా కుమార్తెను హెచ్చరిస్తూ నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక వ్యక్తి హిందీలో మాట్లాడుతూ నా కుమార్తెను కాల్చి చంపుతామని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా నుంచి మరో వ్యక్తి తాను మాఫియా డాన్‌ను అని చెప్తూ బెదిరించాడు. గుర్తు తెలియని నంబర్ల నుంచి, విదేశాల నుంచి ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.’’   

 - డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి

 

వాళ్లేం చిన్న పిల్లలు కాదు...

‘‘భావప్రకటనా స్వాతంత్య్రమనేది అవధులు లేనిది, మినహాయింపులు లేనిది కాజాలదు. దానిపై సహేతుకమైన నియంత్రణ ఉండాల్సి ఉంటుంది. ఇది దురదృష్టకరమైన సంఘటన. కానీ.. వాళ్లు తాము ఏం చేస్తున్నారో తెలియని చిన్న పిల్లలు కాదు. వాక్‌స్వాతంత్య్రం పేరుతో మీరు దేశాన్ని దూషించజాలరు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. దేశ ప్రయోజనాలు, సమైక్యత, సమగ్రతలకు సంబంధించిన అంశాన్ని ఎవరూ రాజకీయం చేయరాదు.’’

  - కిరెన్ రిజుజు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి 

 

విద్యార్థుల గళాన్ని అణచివేస్తున్నారు...

రాహుల్‌గాంధీ ధ్వజం



‘విద్యార్థుల గళాన్ని మోదీ ప్రభుత్వం అణచివేస్తోంది. ఈ వర్సిటీ స్వరాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న వారు దేశవ్యతిరేకులు. వాళ్లు యువత గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షలాది మందిని నాశనం చేసిన హిటర్ అనే ఒక వ్యక్తి జర్మనీలో ఉండేవాడు. ఆ వ్యక్తి ఇతరుల మాటలు విని ఉన్నట్లయితే ఆ దేశం అంతటి బాధను చవిచూడాల్సి వచ్చి ఉండేది కాదేమో. మిమ్మల్ని అణచివేయటం ద్వారా మిమ్మల్ని మరింత బలవంతుల్ని చేస్తున్నారన్న విషయం వారికి తెలియదు. దేశంలో వంద కోట్ల మందికి పైగా ప్రజలకు మీపై విశ్వాసముంది. పేదలు, బలహీనమైన భారతీయ ప్రజల గళం బలపడటం చూసి వారు (ప్రభుత్వం) బెంబేలెత్తిపోతున్నారు. వారిని  అడుగడుగునా ప్రశ్నించండి. జేఎన్‌యూలో విద్యార్థులపై చర్యలు.. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు దారితీసిన చర్యలు ఒకే తరహాలో ఉన్నాయి. ఒక యువకుడు తన అభిప్రాయాన్ని చెప్తాడు.. కేంద్ర ప్రభుత్వం అతడిని దేశ వ్యతిరేకి అంటుంది. అతడు ఏం చేశాడు? తాను నమ్మేదాని గురించి చెప్పేందుకు ఒక భారతీయ విద్యార్థికి ఎందుకు అనుమతించరు?’ అని రాహుల్ ధ్వజమెత్తారు.

 

వీసీ ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకుంటున్నారు...

‘‘మేం హోంమంత్రిని కలిసి జేఎన్‌యూలో ప్రస్తుతమున్న ఉద్రిక్త వాతావరణం గురించి వివరించాం. ఆ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎటువంటి దర్యాప్తు లేకుండానే 20 మంది విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదు చేస్తూ జాబితా విడుదల చేశారు. అందులో డి.రాజా కుమార్తె పేరు కూడా ఉంది. కానీ.. వీడియోలో వాళ్లు నినాదాలు చేస్తూ కనిపించారా? అని మేం అడుగుతున్నాం. వాళ్లు విద్యార్థి సంఘంలో లేదా బృందాల్లో సభ్యులు కాబట్టి అక్కడ ఉన్నారు కానీ.. అందులో వారు కూడా భాగస్వాములని అర్థం కాదు. వర్సిటీ కొత్త వీసీ ప్రభుత్వ సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు.. వర్సిటీలో విద్యార్థులపై దాడులు చేసేందుకు పోలీసులను అనుమతించారు’’

  - సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి 

 

 హిందుత్వ రాజకీయాల కుట్రతోనే అరెస్ట్...

 ‘‘మా కుమారుడు దేశ వ్యతిరేకి కాదు. జాతీయవాది. అతడి వామపక్ష సిద్ధాంతం పట్ల మేం గర్విస్తున్నాం. . అతడు దేశ వ్యతిరేక సిద్ధాంతాన్ని అనుసరించే ప్రసక్తే ఉండదు. అతడు తన వయసులోని లక్షలాది మంది యువత లాగానే జాతీయవాది. అతడి రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో భాగంగా అతడిని అరెస్ట్ చేశారు. నా కుమారుడు ఒక వామపక్ష పార్టీ కార్యకర్త. వామపక్ష సిద్ధాంత విరోధులు మురికి రాజకీయాలు చేస్తున్నారు’’.

 - జైశంకర్‌సింగ్, మీనాదేవి (కన్హయ్య తల్లిదండ్రులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top