ప్రతిపక్ష పార్టీలు మళ్లీ విఫలం

ప్రతిపక్ష పార్టీలు మళ్లీ విఫలం - Sakshi


న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న తొందరపాటు నిర్ణయం కోట్లాది మంది భారతీయులను ఇక్కట్ల పాలు చేసినా ఐక్యతా రాగం వినిపించడంలో ప్రతిపక్ష పార్టీలు మరోసారి విఫలమయ్యాయి. విపక్షంలో ఎవరికి వారే కూటమికి నాయకత్వం వహించాలనే ధోరణియే ప్రధానంగా అందుకు కారణం.


పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్‌ను స్తంభింపచేయడంలో కలిసొచ్చిన విపక్షాలు పార్లమెంట్‌ వెలుపల కలవడానికి ససేమిరా అంటూ కకావికలం అవుతున్నాయి. పక్కా ముందస్తు వ్యూహం లేకుండా నోట్లను రద్దు చేయడంతో తగులుతున్న ఎదురుదెబ్బలను ప్రతిపక్షాల అనైక్యత కారణంగా మోదీ తెలివిగా తప్పించుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి ఎన్‌సీపీ, జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, వామపక్ష పార్టీలు దూరం జరిగాయి.



మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలన్నీ ఎండగడుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలైన చివరి రోజున, అంటే డిసెంబర్‌ 16వ తేదీన రాహుల్‌ గాంధీ చెప్పాపెట్టకుండా మోదీని కలుసుకోవడం వామపక్షాలకు, ఆర్జేడీలకు కోపం తెప్పించింది. అందుకనే ఈ రోజు సమావేశానికి ఆ పార్టీలు స్పందించలేదు. యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా కాంగ్రెస్‌తో కలసిరాలేదు. ఇక మొదటి నుంచి బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్, పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వస్తున్నారు. దాని వెనక కూడా మతలబు ఉందని అంతర్గత పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.


మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లయితే రాహుల్‌ గాంధీ పిలిచే ఇలాంటి సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. రాహుల్‌ ప్రతిపక్ష కూటమి నాయకుడిగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదట. తానే కేంద్ర స్థాయిలో ప్రతిపక్షం కూటమికి నాయకుడిని కావాలన్నది ఆయన అభిలాష అట. అయితే బీహార్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని కలపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నందున మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రాహుల్‌తో కలసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది ఆయన దూరాలోచనని తెలుస్తోంది.



పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మమతా బెనర్జీ మొదట్లో తానే విపక్షం కూటిమికి నాయకురాలిగా చొరవ చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కాస్త ముందుకు వచ్చినా, ఆయనతో కలసి నడవక తప్పడం లేదు. అందుకే ఈ రోజు విపక్షాల సమావేశంలో వారిద్దరు కలసి వేదికను అలంకరించారు.


యాభై రోజులు ఓపిక పట్టండి, నోట్ల కష్టాలు తీరుతాయంటూ నరేంద్ర మోదీ ప్రజలకిచ్చిన భరోసాకు గడువు బుధవారంతో తీరిపోనుంది. అయినప్పటికీ ప్రజలకు నోట్ల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేదు. విపక్షాల తీరు ఇప్పటికైనా మారకపోతే మోదీ మాయ మాటలకు ప్రజలు మోసపోతూనే ఉంటారు. కష్టాలు పడుతూనే ఉంటారు.  –––––ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top