రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర

రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర - Sakshi


బీసీ కమిషన్‌ రద్దుపై రాజ్యసభలో విపక్ష ఆందోళన



న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీబీసీ)ను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై  సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో విపక్షాలు శుక్రవారం రాజ్యసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీని వెనుక రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర ఉందని ఆరోపించాయి. ఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్‌  కురియన్‌ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.



సామాజిక న్యాయం, సాధికారత  మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని అనేకసార్లు స్పష్టం చేశారని చెప్పారు. వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యంగబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందన్నారు. 1992లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటైన ఎన్‌సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించేందుకు బదులుగా రద్దు చేయాలని చూస్తున్నారని  రామ్‌గోపాల్‌ యాదవ్‌(ఎస్పీ) మండిపడ్డారు. ఎన్‌సీబీసీ స్థానంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్‌(ఎన్‌సీఎస్‌ఈబీసీ)ను ఏర్పాటు చేయడం వెనుక దళితులకు, యాదవులకు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర ఉందన్నారు. నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని పరోక్షంగా పేర్కొన్నారు.  ఎస్పీ సభ్యలకు కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు మద్దతు పలికారు.



రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయం

ఐటీశాఖ గత 3 ఆర్థిక సంవత్సరాల్లో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 2,534 వ్యక్తులు, గ్రూపులకు  సంబంధించి సోదాలు జరిపి, రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని బహిర్గతం చేసిందని ఆర్థిక  సహాయ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ లోక్‌సభలో చెప్పారు. నగలు, నగదు సహా రూ. 3,625 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను జప్తు చేసిందన్నారు. బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి 140 కేసుల్లో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ 2016 నాటికి రూ. 8,08,318 కోట్ల వ్యవసాయ రుణాలను అందించామన్నారు.



‘గోవధకు పాల్పడితే మరణ శిక్ష’

గోవధ, గోవుకు సంబంధించిన ఇతర నేరాలకు పాల్పడితే మరణదండన విధించాలని ప్రతిపాదిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు.  దీనికి సంబంధించిన రాజ్యంగంలోని 37వ అధికరణ ప్రకారం ఆవుల సంరక్షణకు కేంద్ర పరిధిలో సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు.



లోక్‌సభకు ‘ఆత్మహత్య’ బిల్లు

మానసిక ఆరోగ్యరక్షణ బిల్లును ఆరోగ్య మంత్రి నడ్డా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మానసిక రోగులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్న దీనికి అన్ని పార్టీల సభ్యు లూ మద్దతు పలికారు. ఆత్మహత్యను నేరంగా పరిగణించకూడదనే ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది.



ఇతర ముఖ్యాంఖ్యాలు

► రూ. 5వేల, రూ. 10వేల నోట్లను ప్రవేశపెట్టే యోచన లేదని ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ లోక్‌సభకు తెలిపారు. దీనిపై రిజర్వు బ్యాంకుతో చర్చించగా, వీటిని ప్రవేశపెట్టే పరిస్థితి లేదని తేలిందన్నారు.

► మాజీ ఎంపీల పింఛన్‌ నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మాజీ ఎంపీల్లో 80 శాతం మంది కోటీశ్వరులని సుప్రీం కోర్టు అన్నట్లు వచ్చిన వార్తలను లోక్‌భలో సభ్యులు ప్రస్తావించడంతో ఆయన స్పందించారు.

► వైద్యవిద్యా సంస్థల్లో అదనంగా 5వేల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లను కల్పించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి నిధులను 28 శాతం పెంచామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top