పోలీసు శాఖకు తాయిలాలు..ఐదు రోజులే పని

పోలీసు శాఖకు తాయిలాలు..ఐదు రోజులే పని


త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలీసు శాఖను ప్రసన్నం చేసుకునేందుకు హోం మంత్రి తాయిలాలు ప్రకటించారు. ప్రస్తుతం విపరీతమైన పనిభారంతో సతమతమవుతున్న పోలీస్ సిబ్బందికి భవిష్యత్తులో మంచిరోజులు రానున్నాయని చెప్పారు. వారానికి ఐదురోజులు పని, పెళ్లిరోజు సెలవు, తగినంత సిబ్బంది నియామకం తదితర వరాలు ప్రకటించారు.

 

సాక్షి, ముంబై: పోలీసు సిబ్బందికి కార్పొరేట్ స్థాయిలో వారానికి ఐదు రోజులు పనిదినాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తెలిపారు. దాదర్‌లోని నాయ్‌గావ్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పాటిల్ హాజరయ్యారు. రాష్ట్ర పోలీస్‌శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఇప్పుడున్న సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడుతోందని ఆయన అన్నారు. అత్యవసర సమయాల్లో, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పోలీసులకు వారాంతపు సెలవులు కూడా రద్దు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

 

దీంతో పోలీసులు ఉత్సవాలు, పండుగలు తమ కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోతున్నారని, ఇది వారిని మానసికంగా వేధిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావుండదని పాటిల్ హామీ ఇచ్చారు.  అందుకే ఈ సమస్య పరిష్కారానికి, శాఖను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో 66 వేల పోస్టుల భర్తీకి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.



 రానున్న రోజుల్లో పోలీసులు వారి పెళ్లి రోజు (మ్యారేజ్ డే) ను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అవసరమైన సెలవు మంజూరు చేస్తామని అన్నారు. వివిధ రాష్ట్రాలతో పోలీస్తే మహారాష్ట్రలో మహిళ పోలీసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేశారు. పోలీసులపై పడుతున్న అదనపు భారాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందులో భాగంగా వారానికి ఐదు రోజులు విధులు నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

 

అందుకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రికి పంపించినట్లు చెప్పారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకానికి మంచి స్పందన వస్తోందన్నారు. పోలీసు భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో కొందరు ప్రాణాలు పోగొట్టుకోగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని పూర్తిగా అరికట్టేందుకు నియమ, నిబంధనాల్లో కొన్ని మార్పులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే మహిళా పోలీసు భర్తీ ప్రక్రియలో మార్పులు చేయడంవల్ల వారు పోలీసు శాఖలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top