కాంగ్రెస్‌ పార్టీని కాంగ్రెస్సే ఓడించగలదు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీని కాంగ్రెస్సే ఓడించగలదు: రాహుల్ గాంధీ - Sakshi


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీని సీపీఎం ఓడించలేదని.. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్‌ను ఓడించగలదని ఆయన అన్నారు. కేరళ పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో బుధవారం పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో బీజేపీ ఏం చేయడానికి ప్రయత్నిస్తోందన్న విషయాన్ని పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్నామని, అందుకే నితీష్, లాలు, కాంగ్రెస్ పార్టీలను ఒకటిగా చేశామని చెప్పారు. బిహార్‌లో బీజేపీని చిత్తుగా ఓడించడంతో వాళ్లు ఎన్నికల ఫలితాలు చూసి దిగ్భ్రాంతి చెందారన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఎక్కువగా వివరాల్లోకి వెళ్లరని, ఆయన తన రాజకీయాలను కూడా కార్యక్రమాల్లాగే చేస్తారని రాహుల్ చెప్పారు.



మోదీ ఏదో ఒక ఆలోచనతో వచ్చి, దాని గురించి మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి, తర్వాత మరో ఆలోచనకు వెళ్లిపోతారని అన్నారు. ఎప్పుడూ ఒక నినాదం నుంచి మరో నినాదం ఇచ్చుకుంటూ పోతారు తప్ప పనేమీ చేయరని విమర్శించారు. తాము ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని ఈ ప్రభుత్వం తీసేసుకుంటోందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనికిరానిదని.. అయితే కాంగ్రెస్ చేసిన తప్పులను దేశం తెలుసుకోడానికే దాన్ని కొనసాగిస్తున్నానని మోదీ అంటారని ఆయన తెలిపారు. కానీ వాస్తవానికి అది చాలా మంచి పథకమని, దానివల్ల గ్రామీణ భారతంలో వృద్ధి నమోదైందని రాహుల్ చెప్పారు. దేశంలో పేద ప్రజలను, వాళ్ల హక్కులను పరిరక్షించడమే తమ లక్ష్యమని.. కానీ బీజేపీకి అందులో ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top