వన్ మినిట్ !

వన్ మినిట్ !


 ఒడిషా శాసనసభలో   వాయిదాల పర్వం

 ఎవరి నిరసన వారిదే

 

 భువనేశ్వర్:  శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజైన శనివారం ఒక్క నిమిషం మాత్రమే జరిగాయి. అధికార, విపక్షాల ఆందోళనతో మూడు రోజుల నుంచి కార్యక్రమాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. శనివారం కూడా అదే పరిస్థితి. పైలీన్ హుద్‌హుద్ తుపానులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం లేదని, దీనిపై సభలో తీర్మానించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్, బీజేపీ సహకరించడం లేదని బీజేడీ ఆరోపిస్తోంది. చిట్‌ఫండ్ అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్, బీజేపీ ఆందోళన చేస్తున్నాయి. తనను దూషించిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్ మహారథి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా ఎమ్మెల్యే రాధారాణి పండా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్నారు.



 స్పీకర్ ప్రయత్నం విఫలం

 శీతాకాల సమావేశాలు మూడో రోజున ప్రారంభమైన వెంటన వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. రెండు రోజులుగా సాగుతున్న ఆందోళనపై తన చాంబర్‌లో   చర్చించేందుకు రావాలని అఖిల పక్షాలకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాటలు పూర్తికాకుండానే అధికార, విపక్ష కాంగ్రెస్ సభ్యులు బ్యానర్లతో ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రాధారాణి ధర్నా చేశారు. దీంతో స్పీకర్ ఉదయం 11.30 గంటల వరకు సభను వాయిదా వేశారు. అప్పటికీ పరిస్థితి కుదుట పడకపోవడంతో మధ్యాహ్నం 12.30కు, తర్వాత 3 గంటలకు వాయిదా వేశారు. సభ్యుల తీరు మారకపోవడంతో సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. తర్వాత 4.30 గంటలకు వాయిదా వేశారు.  




 సరోజ్‌కు సీబీఐ పిలుపుతో...

 మధ్యాహ్నం 12.30 గంటలకు సభాకార్యాక్రమాలు వాయిదా వేసిన స్పీకర్, బీజేపీ మహిళా ఎమ్మెల్యేను దూషించిన అభియోగంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత సభ సక్రమంగా సాగుతుందని అందరూ భావించారు. నవీన్ నివాస్‌లో బీజేడీ అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించే సరోజ్ సాహుకు సీబీఐ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని సమాచారం చేరడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చిట్‌ఫండ్ అక్రమాల్లో సీఎం నవీన్, బీజేడీకి ప్రత్యక్ష సంబంధాలు తెరపూకి వస్తున్నాయని, తమ ఆరోపణ వాస్తవమని తేలుతోందని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా చిట్‌ఫండ్ అక్రమాలపై సభలో నిరవధిక చర్చకు సీఎం నిరాకరించడం, స్పీకర్ అనుమతించకపోవడం సరికాదని పేర్కొన్నాయి. పరిస్థితి చేయి దాటడంతో సాయంత్రం 4.30 గంటల వరకు వాయిదా వేయడం అనివార్యమైంది. మొత్తం మీద శనివారం కేవలం ఒక్క నిముషం మాత్రమే సభా కార్యక్రమాలు జరిగాయి.



 అధికార పక్షమే కారణం: నర్సింగ మిశ్రా

 శాసన సభలో నెలకొన్న పరిస్థితులకు అధికార బిజూ జనతా దళ్ సభ్యులే కారణమని కాంగ్రెస్ శాసనసభా నాయకుడు నర్సింగ మిశ్రా ఆరోపించారు. చిట్‌ఫండ్ మోసాలపై సభలో విస్తృత చర్చకు వీలుగా ప్రశ్నోత్తరాల్ని రద్దు చేయాలని స్పీక ర్‌ను కోరుతుండగా, బీజేడీ సభ్యులు బ్యానర్లతో స్పీకర్ వెల్‌వైపు దూసుకువచ్చారన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తమదైన శైలిలో రంగంలోకి దిగినట్లు ఆయన వివరించారు. స్పీకరు విన్నపాన్ని అధికార బీజేడీ సభ్యులు పెడచెవిన పెట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా, నర్సింగ మిశ్రా వ్యాఖ్యల్ని బీజేడీ అధికార ప్రతినిధి సమీర్ రంజన్ దాస్ ఖండించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top