అవకాశాల్లేకపోతే రిటైర్మెంటే

అవకాశాల్లేకపోతే రిటైర్మెంటే - Sakshi


ముంబై: పాతతరం నటులకు నిర్మాతలు అవకాశాలు ఇవ్వకపోతే రిటైరవడం తప్ప మరో మార్గమే లేదని వెటరన్ నటుడు ఓంపురి పేర్కొన్నాడు. ‘ఎక్కువమంది పాతతరం నటులకు అవకాశాలు అంతగా దొరకడం లేదు. పాత్రలు ఉండడం లేదు. పాశ్చాత్య దేశాల మాదిరిగా మంచి పాత్రలను ఇక్కడ ఆశించలేం. పాశ్చాత్య దేశాల్లో పాతతర నటులకు కూడా అవకాశాలు ఉంటాయి. ప్రేమకథలతోపాటు వారికోసమే ప్రత్యేకంగా అనేక పాత్రలను సృష్టిస్తారు. సినిమాలు తీస్తారు.



ఒకవేళ నాకు కనుక పని లభించనట్టయితే అప్పుడు ఈ రంగం నుంచి తప్పుకుంటా. పాత్రల కోసం ఎవరి తలుపులూ తట్టను. ఒకవేళ అవకాశాలు లభిస్తే మాత్రం విడిచిపెట్టను. అంతగా అవకాశాలు రాకపోయినట్టయితే నాటక రంగానికైనా వెళ్లిపోతా’ అని ఈ 63 ఏళ్ల నటుడు భవితవ్యంపై తన మనసులో మాట చెప్పాడు. ‘100 ఫుట్ జర్నీ’ అనే ఆంగ్ల హాస్య కథాచిత్రంలో నటిస్తున్న ఓంపురికి బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవు. ‘నాకు బాలీవుడ్‌లో పని లేదు. నాకు పని కల్పించమంటూ ఎవరో ఒకరికి చెప్పండి. ఇది అత ్యంత గంభీరమైన విషయం. ప్రియదర్శన్ తరచూ నాకు అవకాశాలు కల్పిస్తుండేవాడు.



ఇప్పుడు అతను కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. పెద్దవయస్కులమైన మాకోసం ప్రత్యేకంగా ఎటువంటి పాత్రలను సృష్టించడం లేదు. పని కల్పించడంటూ నేను ఎవరి గడపా తొక్కడం లేదు’ అని అన్నాడు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్‌కు అవకాశాలు లభిస్తున్నాయని, నా కంటే పెద్దవాడైన అమితాబ్‌కు ఇప్పటికీ అవకాశాలు లభించడం తన లాంటి వాళ్లకు వరమని అన్నాడు. అయితే వాళ్లంతా స్టార్ నటులని, తాము మాత్రం కాదని అన్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top