స్వదేశీ ఉగ్రవాదంపై పోరాడండి

స్వదేశీ ఉగ్రవాదంపై పోరాడండి - Sakshi


* పాక్‌కు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సూచన

* ఢిల్లీ ఐఐటీలో ప్రసంగం


న్యూఢిల్లీ: స్వదేశీ ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు పాకిస్తాన్ మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. తన భూభాగంపై ఉగ్రవాదం చేస్తున్న అరాచకాలను అర్థం చేసుకుని.. దాన్ని అంతమొందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఉగ్ర ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్న పాకిస్తాన్‌లో ఇంతవరకు 50 వేలమంది.. ఉగ్రభూతం బారిన పడి మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పాకిస్తాన్ కూడా ఉగ్రప్రభావిత దేశమే.



అయినా.. పాకిస్తాన్ ఒక్కతే.. డాయిష్, అల్‌కాయిదా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హుక్కానీ నెట్‌వర్క్‌లతో పోరాడలేదు. అందుకే మేం సహాయం అందిస్తున్నాం’ అని ఐఐటీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కెర్రీ తెలిపారు. ఈ సంస్థల ద్వారానే భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని.. అఫ్గానిస్తాన్‌లోనూ అశాంతి, అస్థిరతకు వీరే కారణమన్నారు. భారత్-పాక్ మధ్య స్నేహ బంధం కోసం ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని కెర్రీ అభినందించారు.



దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న అస్థిరతకు మిలటరీ ద్వారా సమాధానం చెప్పలేమని.. చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటే ఇబ్బందులుండవని కెర్రీ తెలిపారు. కాగా, ప్రజల హక్కులను కాలరాయకుండా.. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తమ నిరసనను తెలియజేసే హక్కును కల్పించాలని కెర్రీ అన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఘటనకు సంబంధించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ కెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.



ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు తమ భావాలను వెల్లడించే అవకాశం ఇవ్వనపుడు.. వారు ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందన్నారు. కాగా, మంగళవారం నాటి రెండో వ్యూహాత్మక సమావేశం తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనూ భారత్, అమెరికా దేశాలు.. దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి, ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం, ఉగ్రవాదంపై ఒకే వాణిని వినిపించాయి.

 

మోదీతో కెర్రీ భేటీ

ప్రధానితో కెర్రీ బుధవారం భేటీ అయ్యారు. భారత్‌తోపాటు ఆసియా ప్రాంతంలో అభివృద్ధి కోసం అమెరికా మదిలో ఉన్న ఆలోచనలను ప్రధానితో పంచుకున్నారు. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల పురోగతితోపాటు.. మంగళవారం జరిగిన ఇరుదేశాల రెండో వ్యూహాత్మక సదస్సు వివరాలను ప్రధానికి తెలియజేశారు. కాగా, బుధవారం మధ్యాహ్నం అమెరికా బయలుదేరాల్సిన కెర్రీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.



చైనాలో జరిగే జీ-20 సదస్సులో పాల్గొన్నాక ఒబామాతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. మరోవైపు, భారత-అమెరికా రక్షణ రంగ ఒప్పందంపై చైనా ఆందోళన చెందాల్సిన పనిలేదని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే ఒప్పందమేనంది. భారత్‌కు అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం విషయంలో అమెరికా ఎప్పుటికీ అండగానే ఉంటుందని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top