సునీత పోరాటం ఫలించింది!!

సునీత పోరాటం ఫలించింది!!


ప్రజ్వల స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. రేపిస్టుల ఘాతుకాలపై అలుపెరుగని పోరాటం చేసిన.. హైదరాబాద్కు చెందిన సునీతా కృష్ణన్ కృషి ఎట్టకేలకు ఫలించింది. అత్యాచారం చేయడమే కాక.. ఆ వీడియోను ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్న దుర్మార్గుడిని సీబీఐ వర్గాలు తమ కస్టడీలోకి తీసుకున్నాయి. ఒడిషాలోని భువనేశ్వర్కు చెందిన సబ్రత్ సాహు ఓ ప్రాపర్టీ డీలర్. అతడు చేసిన ఘాతుకాలపై ప్రజ్వల సంస్థ తరఫున సునీతా కృష్ణన్ రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అతడిని అరెస్టు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.



స్వయంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఈ కేసును విచారణకు స్వీకరించి, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సునీతా కృష్ణన్ కేవలం లేఖ రాసి ఊరుకోకుండా దాంతోపాటు నిందితులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోను, వాట్సప్లోను అప్లోడ్ చేసిన అసభ్య వీడియో క్లిప్పింగులున్న పెన్ డ్రైవ్ను కూడా పంపారు. ఈ క్లిప్పింగులను సీబీఐకి పంపాల్సిందిగా కేంద్ర హోంశాఖకు సుప్రీం కోర్టు సూచించింది. వీటిలోని ఓ క్లిప్పింగులో సబ్రత్ సాహు ఓ మహిళపై లైంగిక దాడి చేస్తుండగా, మరో వ్యక్తి దాన్ని చిత్రీకరిస్తున్నట్లు కూడా ఉంది. సాహును మంగళవారం నాడు భువనేశ్వర్లో అరెస్టుచేశారు.



సాహు అరెస్టు పట్ల సునీతా కృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇతర కేసుల్లో మరో ఆరుగురిని కూడా గుర్తించారని, వారిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. ఇప్పటికైనా చర్యలు మొదలైనందుకు సంతోషంగా ఉందని, కానీ  సమాజంలో అన్ని వర్గాలు ఇకనైనా ముందుకొచ్చి ఇలాంటి అన్యాయాలపై పోరాడాలని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top