విశాల్.. ఒబామా.. ఓ ఉద్విగ్నత!

సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మిషెల్ పక్కన విశాల్


న్యూఢిల్లీ: నాలుగేళ్ల కిందట.. అది ఢిల్లీలోని హుమాయూన్ సమాధి.. ఓ విశిష్ట వ్యక్తి వచ్చారు.. సందర్శన అనంతరం అక్కడే కూలిపని చేసుకుంటున్న ఓ 12 ఏళ్ల బాలుడిని ఆప్యాయంగా పలకరించాడు.. ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యం, అతడి ఆశలు, ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నాడు..!

 

 మంగళవారం.. ఢిల్లీలోని సిరి ఆడిటోరియం.. అదే విశిష్ట వ్యక్తి.. నాలుగేళ్ల కిందట పలకరించిన బాలుడిని గుర్తుపెట్టుకున్నాడు.. నాడు అతడు చెప్పిన ఆశలనూ గుర్తుపెట్టుకున్నాడు.. బాలుడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఏమేం చేస్తారో చెప్పారు.. తన కూతుళ్లతో సమానంగా ఆ కూలి బాలుడికి కూడా అవకాశాలు దక్కాలని, అతడి కలలు నెరవేరాలని అభిలషించారు..!!

 ఆ విశిష్ట వ్యక్తి ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆ కూలి బాలుడు విశాల్! సిరి ఆడిటోరియంలో సభికుల మధ్య కూర్చున్న విశాల్ గురించి మాట్లాడి ఒబామా అందరినీ ఆకట్టుకున్నారు. ‘‘నాలుగేళ్ల కిందట నేను హుమాయూన్ సమాధిని సందర్శించినప్పుడు.. ఈ దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న కొందరు కూలీలు, వారి పిల్లలతో మాట్లాడా. భవిష్యత్తుపై ఎన్నో కలలు.. కళ్లలో ఎన్నో ఆశలు నింపుకున్న కొందరు అద్భుతమైన పిల్లల్ని చూశా. వారిలో విశాల్ ఒకరు. ఈరోజు ఆయనకు (విశాల్‌ను చూస్తూ..) 16 ఏళ్లు. ఆయన కుటుంబం దక్షిణ ఢిల్లీకి సమీపంలోని ఓ పల్లెలో నివాసం ఉంటోంది. ఆయన తల్లి హుమాయూన్ సమాధి వద్ద పని చేస్తుంటుంది.

 

 తండ్రి రాళ్ల పని చేస్తాడు. సోదరి యూనివర్సిటీలో చదువుతోంది. మరో సోదరుడు రోజువారీ కూలి. వీళ్లంతా పని చేయడం వల్ల విశాల్ స్కూలుకు వెళ్లగలిగాడు. ఆయనకు కబడ్డీ చూడడం ఇష్టం. సైన్యంలో చేరాలన్నది విశాల్ కల. ఆయనను చూసి మనమంతా గర్వపడాలి. ఇక్కడి పిల్లల్లో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయనడానికి విశాల్ ఒక ఉదాహరణ. నా కూతుళ్లు మాలియా, నషా కలలు నాకు ఎంత ముఖ్యమో విశాల్ కలలు కూడా అంతే ముఖ్యం. నా కూతుళ్లకు దక్కే అవకాశాలే విశాల్‌కూ దక్కాలి.’’ అని ఒబామా అన్నారు. దీంతో ఉద్విగ్నతకు గురైన సభికులు చప్పట్ల మోతతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top