హెచ్-1బి వీసాపై పరిశీలిస్తాం


భారత్ ఆందోళనలపై మోదీకి ఒబామా హామీ

న్యూఢిల్లీ: అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తూ జారీచేసే హెచ్-1బి వీసా అంశంపై భారత్ వ్యక్తంచేస్తున్న ఆందోళనలను.. సమగ్ర వలస సంస్కరణల్లో భాగంగా తాను పరిశీలిస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హామీ ఇచ్చినట్లు అమెరికా అధికారులు సోమవారం వెల్లడించారు.

 

ఆదివారం నాటి ఉన్నతస్థాయి సమావేశంలో.. అమెరికా వలస విధానానికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని.. ఈ అంశంపై మోదీ, ఒబామాలు చర్చించారని అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్.. ఒబామాతో ప్రయాణిస్తున్న అమెరికా విలేకరులకు చెప్పారు. సమగ్ర వలస సంస్కరణల కోసం కాంగ్రెస్‌తో కలిసి కృషి చేయటం జరుగుతోందని.. ఈ క్రమంలో భారత్ లేవనెత్తుతున్నటువంటి అంశాలు అందులో చేర్చటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తన ప్రభుత్వం భారత ప్రభుత్వంతో సంప్రదిస్తుందని ఒబామా హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

 

ఐఎస్‌పై పోరాటంలో సహకారానికీ ఆస్కారం...

ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై భారత్, అమెరికా ప్రస్తుతం జరుపుతున్న చర్చలు ప్రధానంగా దక్షిణాసియాలోని అల్‌ఖైదా, లష్కరే తోయిబా తదితర ఉగ్రవాద సంస్థలపై కేంద్రీకృతమైనప్పటికీ.. ఇరాక్, సిరియాల్లో విజృంభిస్తున్న ఐఎస్‌ఐఎల్ (ఇస్లామిక్ స్టేట్) తిరుగుబాటు సంస్థపై పోరాటంలో భారత్ సహకారానికి ఆస్కారం ఉంటుందని బెన్‌రోడ్స్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

 

రష్యాను అధిగమిస్తాం

భారత్‌కు రష్యాతో సుదీర్ఘ కాల సంబంధాల చరిత్ర ఉందని.. భారత్‌తో తమ సహకారం పెంపొందించుకోవటానికి కారణం.. ఈ దేశం నుంచి మరేదైనా దేశాన్ని బయటకు నెట్టివేయటం కాదని బెన్‌రోడ్స్ స్పష్టంచేశారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన పై విధంగా స్పందించారు. రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగుతాయన్నారు. ‘గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తాను వీక్షిస్తుండగా.. రష్యా సరఫరా చేసిన ఆయుధ సంపత్తిని భారత్ ప్రదర్శించటం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అసౌకర్యానికి గురయ్యారా?’ అని ప్రశ్నించగా.. పరేడ్‌లో అధ్యక్షుడి ముందు నుంచి వెళ్తున్న సైనిక వస్తువు ఏమిటి అనేది ముఖ్యం కాదని.. అధ్యక్షుడు సందర్శిస్తున్న దేశం ఆలింగనం చేసుకున్న వ్యవస్థ ఏమిటనేది ముఖ్యమని ఆయన బదులిచ్చారు. భారత్‌కు ఆయుధాల ఎగుమతి విషయంలో తాము రష్యాను వేగంగా అధిగమిస్తున్నామని పేర్కొన్నారు.

 

సహకారంలో పురోగతిపై అమెరికా సంతృప్తి

భారత్‌లో ఒబామా పర్యటన ద్వారా పౌర అణు ఒప్పందం, రక్షణ ఒప్పందాలు, పరిశుభ్రమైన ఇంధనశక్తి సహకారం వంటి కీలక అంశాల్లో విస్పష్టమైన పురోగతి సాధించటం పట్ల అమెరికా సంతృప్తి వ్యక్తంచేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై, వాణిజ్యం, వ్యాపార సంబంధాల్లో మరింత విస్తృతమైన ఉమ్మడి భాగస్వామ్యానికి అవకాశముందని తాము భావిస్తున్నామని బెన్‌రోడ్స్ పేర్కొన్నారు. ఒబామా, మోదీలు ముందుగా రచించుకున్న ప్రణాళికకన్నా ఎక్కువ సమయం గడిపారని.. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం భారత్, అమెరికా సంబంధాలకు ముఖ్యమైన సంపద అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top