నయనతారకు మద్దతుగా మరో కవి

నయనతారకు  మద్దతుగా మరో కవి


న్యూఢిల్లీ : మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా అరుదైన పురస్కారాన్ని వెనక్కిచ్చిన  రచయిత్రికి ఇపుడో మరో ప్రముఖ కవి   జతకలిశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదాసీన వైఖరికి నిరసనగా సాహిత్య అవార్డును వెనక్కి ఇచ్చి, వార్తల్లో నిలిచిన ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ కు ఇపుడు మరో అవార్డు గ్రహీత, ప్రముఖ కవి అశోక్ వాజ్పేయి  తన మద్దతును తెలియజేశారు.  మోదీ మౌన వైఖరికి నిరసనగా తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును  కూడా వెనక్కి ఇచ్చివేస్తున్నానని ఆయక  ప్రకటించారు. దాద్రి ఉదంతం తనను కలచి వేసిందన్నారు.



లలిత కళా అకాడమీ  మాజీ అధ్యక్షుడు కూడా అయిన అశోక్ వాజ్పేయి కవులు, రచయితలు స్పందించాల్సిన సమయమిది అని వ్యాఖ్యానించారు. మనకి మంచి వాగ్ధాటి గల ప్రధానమంత్రి ఉన్నారు గానీ  రచయితలు, అమాయక ప్రజలు హత్యకు గురవుతుంటే  మౌనంగా ఉండం సబబు కాదన్నారు. తన సహచర మంత్రులు  వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తుంటే ప్రధాని మోదీ వాళ్ల నోర్లు ఎందుకు మూయించలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంలో  సెహగల్ లాంటి రచయిత్రికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సాహిత్య అకాడమీ, జాతీయ అకాడమీ కూడా స్పందించాలని కోరారు.



1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడిన వారిలో  సెహగల్  ప్రముఖులు. పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీస్ సంఘం వ్యవస్థాపకుల్లో ఆమె కూడా  ఒకరు.  అటు ప్రముఖ హేతువాది ఎంఎం కాల్బుర్గి, నరేంద్ర దభోల్కర్ , గోవింద్ పన్సారే హత్యల సందర్భంగా  కూడా ఆమె  తన విమర్శలను ఎక్కుపెట్టారు. హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని హత్య చేస్తున్న వారిని నిరోధించడంలో పాలకులు  విఫలమవుతున్నారని మండిపడుతూ నయనతార సెహగల్ తన పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top