‘మూడు రోజుల్లో మోదీ మ్యాజిక్‌ చేస్తారా’

‘మూడు రోజుల్లో మోదీ మ్యాజిక్‌ చేస్తారా’


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గుమన్నాయి. మూడు రోజుల్లో పెద్ద నోట్ల రద్దు గడువు ముగియనుందని ప్రధాని నరేంద్రమోదీ ఈ మూడు రోజుల్లో మ్యాజిక్‌ చేస్తారా అంటూ నిలదీశాయి. అచ్చే దిన్‌ అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.



పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న కష్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మొత్తం ఎనిమిది పార్టీలు ఒకతాటి మీదకు వచ్చాయి. దీనికి కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ వేదికపై ఉన్నారు. అందరూ కలిసి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు.



‘పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద ఫెయిల్యూర్‌.. భారీ కుంభకోణం. ఉగ్రవాద దాడులు ఆగలేదు.. ఫేక్‌ కరెన్సీ ఆగలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దొరికిన నల్లధనం శూన్యం. 70 ఏళ్లలో ఎన్నడూ లేని తీవ్ర నిరుద్యోగం పెరిగింది. అన్ని వర్గాలు రోదిస్తున్నారు. అచ్చే దిన్‌ అంటూ వచ్చిన మోదీ దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. రైతులు తీవ్రం ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు వేతనాలు లేవు. దేశ కార్మికులను మోదీ అవమానించారు. పెద్ద నోట్ల రద్దు చర్య దేశ ఆర్థిక స్వేచ్ఛపై దాడి. జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు. అవినీతిపై యుద్ధం అన్నమోదీ తనపై వచ్చిన ఆరోపణలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదు. అవినీతి నల్లధనంపై సర్జికల్‌ దాడి అన్నారు. కానీ దాడి మాత్రం జరిగింది పేదల మీద.. మధ్యతరగతి వర్గం మీద. వారే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు తెస్తామంటే ప్రతిపక్షాలు ప్రధానికి అండగా ఉంటాయి. నోట్ల రద్దు వెనుక ఉద్దేశాలు ఏమిటో ప్రధాని చెప్పాలి. విచారణకు షీలా దీక్షిత్‌ వెనుకాడటం లేదు. ప్రధాని మోదీ ఎందుకు వెనుకాడుతున్నారు’ అని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.



అంతకుముందు మమతా బెనర్జీ మాట్లాడుతూ..

‘దేశంలో పెద్ద నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకునే సమయంలో పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదు. మీరు తీసుకున్న నిర్ణయం చట్టానికి విరుద్ధం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. అసలు ఈ నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఒక ప్రకటన అయినా చేశారా? నగదు రహిత పరిస్థితి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధారం లేనిది, ముఖం లేనిదిగా తయారైంది. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద నోట్ల రద్దు చర్య ఓ పెద్ద కుంభకోణం’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top