ఏసీ బస్సుల్లో భద్రత డొల్ల


సాక్షి, ముంబై : బహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సుల్లో ప్రాథమిక చికిత్స బాక్సులు  అలంకార ప్రాయంగా మారాయి.  వైద్యపరమైన కిట్‌లను బస్సుల్లో అమర్చినా అవి ఖాళీగా మాత్రమే దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రయాణికులకు చికిత్స అందేపరిస్థితి లేకుండా పోయింది. తరచూ ప్రజా రవాణాలో ఏదో ఒక ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంటూనే ఉన్నా అధికారులు మాత్రం ముందు జాగ్రత్త చర్యలపై నిర్లక్ష్య వీడడం లేదు.



 ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కనీసం ఉన్న సదుపాయాలను కూడా సక్రమంగా నిర్వహించడం లేదు.  సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనల (138 4(డి) మేరకు ప్రతి వాహన డ్రైవరు ఫస్ట్ ఎయిడ్ బాక్సును నిర్వహించాలి. ఇందులో యాంటీ సెప్టిక్ క్రీం, ప్లాస్టర్, తదితర వస్తువులతో కూడుకొని ఉండాలి కానీ ఇవేమీ ఇక్కడ కన్పించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితేకానీ అధికారులు స్పందించే పరిస్థితి కన్పిస్తోంది.



 ‘ఖాళీగా బాక్స్’

 ‘ఓ రోజు తనకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సమీపంలో కూర్చునే అవకాశం కలిగింది, ఈ బాక్సులో ఏముందో చూద్దానమి తెరచి చూడగా ఖాళీగా ఉండంది.  ఏసీ కింగ్ లాంగ్ బస్సులను సక్రమంగా నిర్వహించాలని బెస్ట్ అధికారులను కోరా’నని జూహూ-అంధేరీల మధ్య రోజూ ఏసీ బెస్ట్‌బస్సుల్లో వెళ్లే ప్రయాణికుడు సుహేల్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరం లోపల మాత్రమే ఈ బస్సులు సంచరిస్తాయనీ,  వీటికి ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వలేదని బెస్ట్ సీనియర్ పబ్లిక్ రిలేషన్ అధికారి ఏ.ఎస్.తాంబోలి తెలిపారు.



 ఏసీ బస్సుల్లో వైద్యకిట్‌లు నిల్

 రోజూ 4,200 నాన్ ఏసీ బస్సులు, 287 ఏసీ బస్సులను బెస్టె రోడ్లపై  నడుపుతోంది. ఈ రెండు రకాల బస్సులకు అగ్ని నిరోధక యంత్రాలు  సమకూర్చుకునేందుకు వీలు కల్పించారు. అవసరమైన నిధులు కూడా కేటాయించారు.  కానీ ఏసీ బస్సుల్లో మాత్రమే అత్యవసర వైద్య కిట్‌ను అమర్చాలనే నిబంధన ఉంది.  ఈ ఏసీ బస్సుల్లో చాలా వాటిల్లో  అత్యవసర వైద్య కిట్‌లు లేవు.



అంతేకాకుండా అగ్ని నిరోధక యంత్రాలు కూడా చాలా బస్సుల్లో లేవు. బస్సుల్లో ముందస్తు జాగ్రత్త పరమైన చర్యలు కూడా తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తుం చేస్తున్నారు. అత్యవసర సమయంలో అద్దాలను పగులగొట్టేందుకు హ్యామర్లు కూడా బస్సుల్లో అందుబాటులో లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్ధంపడుతోంది. తక్షణమే బెస్ట్ బస్సులో భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top