సబ్సిడీ సిలిండర్లను తగ్గించబోం!

సబ్సిడీ సిలిండర్లను తగ్గించబోం!


కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

త్వరలోనే వంటగ్యాస్‌కు నగదు బదిలీ ప్రారంభం

ఇందుకు ఆధార్ తప్పనిసరి కాదు

తొలుత 54 జిల్లాల్లో అమలు


 

న్యూఢిల్లీ: దేశంలో గృహ వినియోగానికి సబ్సిడీపై అందజేస్తున్న ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను తగ్గించే యోచనేదీ లేదని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అలాగే వంటగ్యాస్‌కు నగదు బదిలీని వచ్చే ఏడాది జూన్‌లోగా దేశమంతటికీ విస్తరిస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో గృహ వినియోగదారులకు ఏటా 12 వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై అందజేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు వీటిని నెలకొకటి మాత్రమే ఇవ్వాలన్న పాత నిబంధనను మోదీ సర్కారు తొలగించి.. ఏడాదిలో ఎప్పుడైనా వీటన్నింటినీ తీసుకునే వెసులుబాటు కల్పించింది కూడా. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు వివరాలను వెల్లడించారు. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను తగ్గించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నుంచి వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమలు చేస్తామని.. సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తామని తెలిపారు.

 

 ఈ పథకాన్ని సవరించామని, గతంలోలాగా ఆధార్ నంబర్‌ను ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర మంత్రి వెల్లడించారు. తొలుత 54 జిల్లాల్లో నగదు బదిలీని ప్రారంభిస్తామని.. జనవరి 1 నుంచి మిగతా చోట్ల అమలు చేస్తామని చెప్పారు. వచ్చే జూన్ నాటికి దాదాపు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో వంటగ్యాస్‌కు నగదు బదిలీ అమల్లోకి వస్తుందని తెలిపారు. జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచినవారికి కూడా ఈ పథకం నుంచి ప్రయోజనం కలుగనుందన్నారు. ప్రస్తుతం వంటగ్యాస్‌కు బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తికాగానే సబ్సిడీలను జమ చేయడం ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. నగదు బదిలీ కింద జమ చేసే సబ్సిడీ మొత్తాన్ని నిర్ణయించేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే సమయంలో దేశంలో వ్యాపార పరిస్థితులను సులభతరం చేస్తామని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top