రాత్రివేళల్లో అబ్బాయిలకేం పని: నటి

రాత్రివేళల్లో అబ్బాయిలకేం పని: నటి - Sakshi


చండీగఢ్‌: హర్యాణాలో ఓ ఐఏఎస్‌ అధికారి కుమార్తె వర్ణికా కుందును రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలా వేధించిన ఘటనపై బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంట్లో కుర్చోపెట్టాల్సింది అమ్మాయిలను కాదని అబ్బాయిలనని  ఆమె అభిప్రాయపడ్డారు‌. ఈ కేసుతో రాజకీయాలకు ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.



అమ్మాయిలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని రాత్రివేళల్లో బయటికి పంపకూడదని.. అయినా రాత్రివేళల్లో రోడ్లపై వారికి ఏం పని ఉందన్న మరో బీజేపీ ఎంపీ రాంవీర్ భట్టి వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఓ యువతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు.. ఆయనకు నోరెలా వచ్చిందంటూ మండిపడ్డారు. 'కేవలం రాత్రివేళల్లోనే ఎందుకు ఇలా జరుగుతోంది. పగలు ఈ దుర్మార్గాలు తక్కువన్న విషయం పక్కనపెడితే.. రాత్రివేళల్లో బయటకు రాకుండా ఉండాల్సింది అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. యువకులకు రాత్రిపూట రోడ్లపై ఏం పని ఉంది. వారిని ఆ సమయంలో ఇంట్లో కూర్చోపెడితే ఈ సమస్యలే తలెత్తవని' ఆమె అభిప్రాయపడ్డారు.



ఈ ఘటన జరిగిన సమయంలో తాను చండీగఢ్‌లో లేనని, తాను ఎంపీని మాత్రమేనని, డీఐజీనో.. గవర్నర్‌నో కాదన్నారు. కానీ ప్రతి వివాదంలోనూ నేత మనీశ్ తివారీ తనను లాగుతున్నారని చెప్పారు.  ఈ కేసును విచారిస్తున్న లుథార బాధితురాలికి న్యాయం చేస్తారని ఆకాంక్షించారు. కేసును నీరుగార్చే యత్నాలు జరగలేడం లేదని కిరణ్ ఖేర్ వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top